మేం నాలుగోసారి అధికారంలోకి వస్తామని చెప్పలేం: కేంద్రమంత్రి గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడే అతికొద్ది మంది రాజకీయ నాయకుల్లో ఒకరు.

By Srikanth Gundamalla  Published on  23 Sep 2024 9:56 AM GMT
మేం నాలుగోసారి అధికారంలోకి వస్తామని చెప్పలేం: కేంద్రమంత్రి గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడే అతికొద్ది మంది రాజకీయ నాయకుల్లో ఒకరు. తాజాగా మరోసారి ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి నితిన్ గడ్కరీ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా తనతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అథవాలేను ఉద్దేశించి సరదాగా కొన్ని కామెంట్స్ చేశారు. నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాము కేంద్రంలో నాలుగోసారి అధికారంలోకి వస్తామని నమ్మకంగా చెప్పలేమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కానీ.. రామ్‌దాస్‌ అథవాలే కేంద్ర మంత్రి అవుతారని కచ్చితంగా చెప్పగలను అన్నారు. అయితే.. ఇదంతా తాను సరదాగానే చెప్తున్నాననీ.. సీరియస్‌గా మాత్రం తీసుకోవద్దని అన్నారు. ఎన్డీఏలో భాగస్వామి అయిన రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నాయకుడు రామ్‌దాస్‌ అథవాలే.. వరుసగా మూడోసారి మోదీ క్యాబినెట్‌లో పనిచేస్తున్నారు. నాలుగోసారి కూడా ఎన్డీఏ అధికారంలోకి వస్తే మంత్రిని అవుతానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. కాగా.. మహారాష్ట్రలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార మహాయుతి (శివసేన (షిండే), బీజేపీ, ఎన్సీపీలో భాగస్వామి అయిన ఆర్పీఐ 10 నుంచి 12 స్థానాలను ఆశిస్తోంది. నాగ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఇదే విషయం వెల్లడించారు. ఉత్తర నాగ్‌పూర్, ఉమ్రేద్, ఉమర్‌ఖేడ్, యావత్మల్, వాషీమ్ సహా విదర్బలో మూడు నుంచి నాలుగు సీట్లలో తమ పార్టీ గుర్తుపైనే పోటీ చేస్తామని చెప్పారు.కనీసం 10 నుంచి 12 సీట్లైనా మాకు ఇస్తారని ఆశిస్తున్నామని అథవాలే అన్నారు.

Next Story