ఉగ్రవాదులపై ప్రతిచర్యలకు నియమాలు అవసరం లేదు: కేంద్ర మంత్రి జైశంకర్
ఉగ్రవాదంపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సంచలన కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 13 April 2024 5:52 AM GMTఉగ్రవాదులపై ప్రతిచర్యలకు నియమాలు అవసరం లేదు: కేంద్ర మంత్రి జైశంకర్
ఉగ్రవాదులు ఎలాంటి నియమాలను పెట్టుకుని దాడులు చేయరని.. అలాంటి అప్పుడు వారి చర్యలకు ప్రతిచర్యలు తీసుకోవడానికి కూడా ఎలాంటి నియమాలకు లోబడాల్సిన అవసరం లేదని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ సంచలన కామెంట్స్ చేశారు.
ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించకూడదని కేంద్రమంత్రి జైశంకర్ అన్నారు. గత పదేళ్లలో దేశ విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందని ఆయన చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే ప్రతి చర్యలకు కూడా నియమ నిబంధనలు ఉండొద్దని.. ఇదే సరైన విధానమని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ అన్నారు. ముష్కరులకు ఎలాంటి నియామాలు లేనప్పుడు.. దాడులకు ప్రతిస్పందన కూడా అలాగే ఉండాలన్నారు. ఇదే కార్యక్రమంలో ఏయే దేశాలతో సంబంధాలు కొనసాగించడం కష్టంగా ఉంటుందని ప్రశ్న అడగ్గా.. దానికి స్పందించిన కేంద్రమంత్రి ఇలా సమాధానం ఇచ్చారు. 'పొరుగున ఉన్న పాకిస్తాన్' అని చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించకూడదంటూ దాయాది దేశాన్ని ఉద్దేశిస్తూ కేంద్రమంత్రి జైశంకర్ ఈ కామెంట్స్ చేశారు.
2014 నుంచి మన విదేశీ విధానంలో 50 శాతం మార్పు వచ్చిందని జైశంకర్ తెలిపారు. అది కూడా ఉగ్రవాదంపై మనం స్పందించే తీరులోనే అని చెప్పారు. ముంబై దాడుల తర్వాత ఉగ్రవాదంపై భారత్ స్పందించాలని అందరూ అనుకున్నారనీ.. ఆ సమయంలో పాక్‌పై దాడి చేయడం కంటే.. చేయకపోవడం వల్లే ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఒకవేళ 26/11 ముంబై పేలుళ్ల వంటి ఘటన ఇప్పుడు జరిగితే దానికి మనం ప్రతీకారం తీర్చుకోకపోతే తర్వాతి దాడులను ఎలా నిరోధించగలమని జైశంకర్ అన్నారు. అయితే.. ముష్కరులు సరిహద్దులకు ఆవతల ఉన్నాం.. ఎవరేం చేస్తారులే అన్నట్లు భావిస్తున్నారని అన్నారు. అది నిజం కాదని మనం రుజువు చేయాలని జైశంకర్ అన్నారు. వారు దాడి చేయడానికి ఎలాంటి రూల్స్ పెట్టుకోరు.. అలాగే మన ప్రతి చర్యలు కూడా నియమాలకు లోబడాల్సిన అవసరం లేదని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు.