పూజా ఖేడ్కర్‌కు షాక్ ఇచ్చిన కేంద్రం
వివాదాస్పద మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్ పూజా ఖేడ్కర్‌కు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది.
By Srikanth Gundamalla
వివాదాస్పద మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్ పూజా ఖేడ్కర్‌కు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి తొలగిస్తూ శనివారం ఉత్తర్వులు వెలువరించింది. ఐఏఎస్ (ప్రొబేషన్) నిబంధనలు 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే.. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన పూజా ఖేడ్కర్ ప్రొబేషనరీ కలెక్టర్‌గా పుణేలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె విషయంలో సంచలనాలు బయటపడ్డాయి. యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.
తప్పుడు పత్రాలు సమర్పించడంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో దివ్యాంగుల కోటాలో సివిల్స్‌కు ఎంపికైనట్టు చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు యూపీఎస్సీ వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీచేసింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేశారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సమయంలో యూపీఎస్సీ వాదనలను తోసిపుచ్చారు. తాను ఎటువంటి పత్రాలను ఫోర్జరీ చేయలేదని, యూపీఎస్సీకి తనపై అనర్హత వేటువేసే అధికారం లేదని వాదించారు. సివిల్ సర్వీసెస్‌కు ఒకసారి ఎంపికై ప్రొబేషనరీ ఆఫీసర్‌గా నియమితులైన తర్వాత ఓ అభ్యర్ధిపై అనర్హత వేసే అధికారం యూపీఎస్సీకి లేదు. తనపై చర్యలు తీసుకోవాలంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT)కు మాత్రమే ఉందని వాదనలను వినిపించారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఆమెను ఐఏఎస్ నుంచి తొలగించింది.