కేంద్ర మాజీమంత్రి కన్నుమూత
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కె. నట్వర్ సింగ్ శనివారం రాత్రి కన్నుమూశారు
By Srikanth Gundamalla Published on 11 Aug 2024 3:00 AM GMTకేంద్ర మాజీమంత్రి కన్నుమూత
దీర్ఘకాలంగా వృద్ధ్యాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కె. నట్వర్ సింగ్ శనివారం రాత్రి కన్నుమూశారు. ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో ఉన్న మేదాంత ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నట్వర్ సింగ్ ప్రాణాలు విడిచినట్లు ఆయన కుటుబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం 93 ఏళ్ల వయసు ఉన్న నట్వర్.. గత రెండు వారాలుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందారు. కానీ.. శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు.
నట్వర్ సింగ్ అంత్యక్రియలను ఢిల్లీలో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. ప్రస్తుతం ఆయన కుమారుడు ఆస్పత్రి వద్దే ఉన్నారనీ.. మిగతా కుటుంబ సభ్యులు కూడా స్వస్థలం నుంచి ఢిల్లీకి వెళ్తున్నారని తెలిసింది. ఆదివారం రోజే నట్వర్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. కొంతకాలంగా నట్వర్ సింగ్ ఆరోగ్యం బాగాలేదని, శనివారం అర్ధరాత్రి ఆయన తుదిశ్వాస విడిచారని వివరించారు.
కాగా కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ 1931లో రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో జన్మించారు. మాజీ కాంగ్రెస్ ఎంపీ అయిన నట్వర్ సింగ్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ-1 ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2004-05 కాలంలో భారత విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు పాకిస్థాన్ రాయబారిగా, 1966-1971 వరకు మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ కార్యాలయంలో కూడా పనిచేశారు. ఇక 1984లో ఆయనను పద్మభూషణ్ వరించింది. అనేక పుస్తకాలను కూడా రచించారు కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్.