ఉదయనిధి స్టాలిన్, ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు
సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్‌తో పాటు మద్దతు తెలిపిన ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు అయ్యింది.
By Srikanth Gundamalla Published on 6 Sept 2023 11:11 AM ISTఉదయనిధి స్టాలిన్, ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. కాంగ్రెస్ సహా పలువురు ప్రముఖులు ఉదయనిధి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అంటూ పిలుపునిస్తున్నారు. అంతేకాదు.. సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్‌ను బెదిరిస్తూ ఓ స్వామిజీ హెచ్చరికలు చేశారు. ఉదయనిధి తలకు రూ.10 కోట్లు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. అది ఎవరూ చేయలేకపోతే.. తానే చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక దీనిపై స్పందించిన ఉదయనిధి.. స్వామిజీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తాను బెదిరింపులకు భయపడనని.. తన తల కోసం రూ.10 కోట్లు అవసరం లేదని.. రూ.10 దువ్వెన అయితే దువ్వుకుంటానని అన్నారు. ఇక సోషల్ మీడియాలో ఉదయనిధి కామెంట్స్‌పై చర్చ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సనాతన ధర్మంపై అనుచితంగా మాట్లాడారంటూ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో పాటు.. ఆయనకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేలపై ఉత్తర్ ప్రదేశ్‌లోని రాంపూర్‌లో కేసు నమోదు అయ్యింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేందుకే ఇలా మాట్లాడుతున్నారంటూ.. సీనియర్ న్యాయవాదులు హర్ష్ గుప్తా, రామ్‌సింగ్ లోధి రామ్‌పూర్‌లోని కొత్వాలి సివిల్ లైన్స్‌లో కంప్లైంట్ చేశారు. ఇద్దరూ తమ ప్రకటనలతో మతపరమైన ఉన్మాదాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు రాంపూర్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రామ్ సింగ్ లోధీ రాంపూర్ పోలీస్ సూపరింటెండెంట్‌కు వాంగ్మూలం ఇచ్చారు. దీనిపై సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరిపై కేసు పెట్టారు. ఈ కేసు విచారణ సెప్టెంబర్ 15న జరగనుంది.
2023 సెప్టెంబర్ 4న సనాతన ధర్మానికి సంబంధించి మంత్రి ఉదయ్ నిధి స్టాలిన్ ఉద్వేగభరితమైన ప్రకటన చేశారని న్యాయవాది హర్ష్ గుప్తా తన ఫిర్యాదులో తెలిపారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనా వంటితో పోల్చారని మాట్లాడారని పేర్కొన్నారు. ఉదయ్ నిధి వ్యాఖ్యలను కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే సమర్థించారన్నారు. ఇది హిందూ మతాన్ని విశ్వసించే వారి మతపరమైన మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుందని వెల్లడించారు. అందుకే వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరామని హర్ష్ గుప్తా తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.