చాన్స్ వచ్చినప్పుడల్లా బ్రిజ్‌భూషన్ మహిళా రెజ్లర్లను వేధించాడు: పోలీసులు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భూషన్‌పై అభియోగాలు మోపడానికి తగిన ఆధారాలు ఉన్నాయన్నారు పోలీసులు.
By Srikanth Gundamalla Published on 24 Sept 2023 12:19 PM IST
చాన్స్ వచ్చినప్పుడల్లా బ్రిజ్‌భూషన్ మహిళా రెజ్లర్లను వేధించాడు: పోలీసులు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌పై అభియోగాలు మోపడానికి తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు ఢిల్లీ పోలీసులు. అవకాశం దొరికినప్పుడల్లా మహిళా రెజ్లర్లను బ్రిజ్‌భూషన్ సింగ్ వేధించాడని కోర్టుకు తెలిపారు.
మహిళా రెజ్లర్లను బ్రిజ్ భూషన్ వేధించాడని ఇటీవల రెజ్లర్లు ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీ కోర్టులో వేధింపులకు సంబంధించి విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే అవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి. దర్యాప్తు చేసిన పోలీసులు ఢిల్లీ కోర్టుకు పలు విషయాలు వెల్లడించారు. మహిళా రెజ్లర్లపై లైంగింగ వేధింపుల విషయంలో బ్రిజ్‌భూషన్ ఏ చిన్న అవకాశం దొరికినా వాడుకున్నాడని చెప్పారు. మొదట్లో బ్రిజ్ భూషన్ తమను లైగింకంగా వేధించాడని పలువురు మహిళ రెజర్లు ఆరోపించినా ఢిల్లీ పోలీసులు పట్టించుకోలేదు. అనంతరం సుప్రీంకోర్టు అతనిపై కేసు నమోదు చేయాలని ఆదేశించగా దిగి వచ్చిన ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఢిల్లీ పోలీసుల తరఫున న్యాయవాది అతుల్ శ్రీవాస్తవ కోర్టులో వాదనలు వినిపించారు. బ్రిజ్‌భూషణ్‌కు తాను ఏం చేస్తున్నానో తెలుసని పేర్కొన్నారని చెప్పారు. భారతదేశం వెలుపల జరిగిన కేసులకు సీర్పీసీ సెక్షన్ 188 ప్రకారం అనుమతి అవసరమన్న బ్రిజ్‌భూషణ్ తరపు న్యాయవాది వాదనకు నేరాలన్నీ దేశం బయట జరిగితే మాత్రమే సీర్పీసీ సెక్షన్ 188 ప్రకారం అనుమతి అవసరమని అతుల్ పేర్కొన్నారు. అయితే బ్రిజ్ భూషణ్ విషయంలో ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ నేరాలు జరిగాయని, కాబట్టి అనుమతి అవసరం లేదంటూ అతుల్ కౌంటర్ ఇచ్చారు.
తజకిస్థాన్‌లో ఓ ఈవెంట్ సందర్భంగా బ్రిజ్‌భూషన్ ఒక రెజ్లర్‌ను గదిలోకి పిలిచి హగ్ చేసుకునే ప్రయత్నం చేశారని పోలీసులు కోర్టుకు తెలిపారు. బాధితురాలు నిరసన తెలిపితే.. తాను తండ్రిలానే దగ్గరకి తీసుకున్నట్లు బ్రిజ్ భూషన్ అన్నాడని పోలీసులు వెల్లడించారు. అనుమతి లేకుండా దురుద్దేశంతోనే తాకాడని మరో మహిళా రెజ్లర్ పేర్కొన్న విషయాన్ని కూడా ధర్మాసనానికి వెల్లడించారు పోలీసులు. ఇవన్నీ బ్రిజ్ భూషణ్ దురుద్దేశంతోనే చేశాడని పోలీసులు కోర్టుకు తెలిపారు.
కాగా.. బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళా రెజ్లర్లు జూన్ 15న కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును ఢిల్లీ కోర్టు విచారిస్తోంది. పోలీసుల తరఫు లాయర్ వాదనల తర్వాత తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది ఢిల్లీ కోర్టు.