రైతులకు బాక్సర్ విజేందర్ సింగ్ మద్దతు.. రాజీవ్ ఖేల్ రత్న వెనక్కిచ్చేస్తా

Boxr Vijender Singh Expressed support for farmers .. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళ‌న పెరుగుతోంది.

By సుభాష్  Published on  7 Dec 2020 4:02 AM GMT
రైతులకు బాక్సర్ విజేందర్ సింగ్ మద్దతు.. రాజీవ్ ఖేల్ రత్న వెనక్కిచ్చేస్తా

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళ‌న పెరుగుతోంది. దేశ‌వ్యాప్తంగా రైతుల‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. తాజాగా.. రైతులకు ప్రముఖ బాక్సర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత విజేందర్ సింగ్ మద్దతు పలికారు. నిన్న రైతు ఉద్యమంలో పాల్గొన్న ఆయన.. నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాడు. లేదంటే ప్రభుత్వం ఇచ్చిన రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డును తిరిగి ఇచ్చేస్తానని హెచ్చరించాడు.

పంజాబ్‌లోనే తాను క్రీడా శిక్షణ పొందానని, తనకు అన్నం పెడుతున్న రైతులు గడ్డకట్టే చలిలో ఆందోళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వారి సోదరుడిగా మద్దతు ప్రకటించడానికి వచ్చానన్నాడు. ఇప్ప‌టికే.. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన పలువురు క్రీడాకారులు రైతు సమ్మెకు మద్దతు పలికారు. అటు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ సైతం రైతు ఆందోళనకు మద్దతుగా పద్మ విభూషణ్ అవార్డును వెనక్కి ఇచ్చేస్తానని స్పష్టం చేశారు.

డిసెంబర్ 8న జరగనున్న భారత్ బంద్‌కు పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. మరోవైపు రైతు సంఘాలతో కేంద్రం జరిపిన చర్చలు సఫలం కాలేదు. మరోసారి రైతులతో చర్చించాలని కేంద్రం నిర్ణయించింది.

Next Story