Kolkata: ఇండియన్ మ్యూజియానికి బాంబు బెదిరింపు

కోల్‌కతాలో బాంబు బెదిరింపు మెసేజ్‌ కలకలం రేపింది.

By Srikanth Gundamalla  Published on  5 Jan 2024 9:00 AM GMT
bomb warning, mail,  kolkata, indian museum,

Kolkata: ఇండియన్ మ్యూజియానికి బాంబు బెదిరింపు

కోల్‌కతాలో బాంబు బెదిరింపు మెసేజ్‌ కలకలం రేపింది. సందర్శకులు ఎప్పుడు తిరుగుతూ ఉండే కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియంకు ఈ బాంబు బెదిరింపులు వచ్చాయి. మ్యూజియంలో బాంబు అమర్చామనీ గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో.. పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. మ్యూజియం వద్దకు వెళ్లి సందర్శకులను వెంటనే బయటకు పంపించేశారు. బాంబ్‌ స్క్వాడ్‌ టీమ్‌ను పిలిపించి తనిఖీలు చేశారు.

అయితే.. బాంబ్‌ స్క్వాడ్‌ బృందం మ్యూజియం మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. ఎక్కడా కూడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దాంతో.. బాంబు బెదిరింపు వార్నింగ్ ఒక ఫేక్‌ అని అధికారులు నిర్ధారించారు. ఇటీవల కాలంలో అమెరికా వంటి దేశం నుంచి ఇలాంటి మెయిల్‌ కొన్ని వస్తున్నట్లు మ్యూజియం అధికారులు చెప్పారు. బెదిరింపులకు పాల్పడవారి మెయిల్‌ను తనిఖీ చేశామన్నారు. అయితే.. బాంబు బెదిరింపులకు పాల్పడ్డవారు ఉగ్రవాద సంస్థలతో తమకు సంబంధాలు ఉన్నట్లు మెయిల్‌ పంపారనీ పోలీసులు తెలిపారు.

కాగా.. దేశంలో ఇలాంటి సంఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. ఇటీవల న్యూఇయర్ రోజున ముంబైలో కూడా పేలుళ్లకు సంబంధించి వార్నింగ్ కాల్ వచ్చింది. దాంతో.. అప్రమత్తమైన ముంబై పోలీసులు నగరం మొత్తం జల్లెడ పట్టారు. అంతేకాదు.. కొందరు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఎయిర్‌పోర్టులు, బ్యాంకులకు ఇలా కొన్నింటికి బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఇక నిన్న ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. అయోధ్యలో నిర్మించిన రామమందిరంతో సహా పేల్చేస్తామంటూ యోగి ఆదిత్యనాథ్‌కు బెదిరింపులు వచ్చాయి.


Next Story