కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ బీజేపీని వదిలిపెట్టి కాంగ్రెస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పార్టీ నుండి నిష్క్రమించడం వెనుక బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఉన్నారని జగదీష్ షెట్టర్ ఆరోపించారు. బీఎల్ సంతోష్ తనపై కుట్ర పన్నారని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ నిరాకరించడం ద్వారా తనను అవమానించారని జగదీష్ షెట్టర్ అన్నారు. గతంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, అసెంబ్లీలో మాజీ ప్రతిపక్ష నేతగా, మాజీ స్పీకర్‌గా, పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయనకు బీజేపీ నుంచి పోటీ చేసేందుకు టిక్కెట్ నిరాకరించడంతో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు.
ఆదివారం తన పదవికి, బీజేపీ సభ్యత్వానికీ రాజీనామా చేసిన షెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్ణాటకలో బీజేపీ బలోపేతానికి తాను చేసిన కృషిని పార్టీ హైకమాండ్ విస్మరించిందని, పార్టీ టికెట్ ఇవ్వకుండా అవమానించడంతో గత్యంతరం లేక పార్టీని వీడానని చెప్పారు. పార్టీ నిర్ణయంతో తన మనసు విరిగి పోయిందని అన్నారు. ఒకవేళ టికెట్ ఇస్తామని చెప్పినా తన నిర్ణయంలో మార్పు ఉండేది కాదని జగదీశ్ షెట్టర్ తేల్చి చెప్పారు. జగదీశ్ షెట్టర్ రాజీనామాపై ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై స్పందించారు. షెట్టర్ నిర్ణయం తనను బాధించిందని, పార్టీలోనే కొనసాగితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సీనియర్ నేతగా ఆయన బీజేపీకి చాలా ముఖ్యమైన వ్యక్తి అని బొమ్మై అన్నారు.