బెంగళూరుని ముంచెత్తుతున్న వానలు.. 133 ఏళ్ల తర్వాత..

రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి.

By Srikanth Gundamalla  Published on  3 Jun 2024 10:38 AM GMT
bengaluru, heavy rain,  record break,

 బెంగళూరుని ముంచెత్తుతున్న వానలు.. 133 ఏళ్ల తర్వాత.. 

రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. దాంతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఆదివారం పలు చోట్ల రాత్రి మొత్తం నిరంతరాయంగా వర్షం కురిసింది. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదు అయ్యింది. గత 133 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వర్షపాతం ఒక్కరోజే నమోదు కావడం గమనార్హం.

బెంగళూరులో ఆదివారం వాన దంచికొట్టింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా వర్షం కురిసింది. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులతో వర్షం పడటంతో నగర ప్రజలంతా ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. నగరంలోని రోడ్లు చెరువులను తలపించాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ సరఫరాను కూడా అధికారులు నిలిపివేశారు. మరోవైపు ఈదుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి పడ్డాయి. రోడ్లపై చెట్లు విరిగిపడటం రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆదివారం ఒక్కరోజే నగరంలో 111.1 మిల్లీమిటీర్ల వర్షపాతం నమోదు అయ్యినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

ఇంత భారీ మొత్తంలో వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి అని అధికారులు వెల్లడించారు. గతంలో 1891 జూన్‌ 16న బెంగళూరు నగరంలో 106.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. ఆ తర్వాత దానికి మించి వర్షపాతం జూన్‌ 3 ఆదివారం నమోదు అయ్యిందని పేర్కొన్నారు. ఇప్పుడా రికార్డు బద్దలయినట్లు చెప్పారు. ఇక రానున్న రోజుల్లో వర్షాలు కొనసాగుతాయని బెంగళూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. జూన్ 5వ తేదీ వరకు వర్షాలు ఇదే విధంగా ఉంటాయని చెప్పారు. బెంగళూరు నగరానికి వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


Next Story