గణేషుడి మెడలో రూ.4లక్షల విలువైన చైన్.. మర్చిపోయి నిమజ్జనం, చివరకు..
దేశవ్యాప్తంగా వినాయకుడి పూజలు కొనసాగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 12 Sep 2024 5:54 AM GMTదేశవ్యాప్తంగా వినాయకుడి పూజలు కొనసాగుతున్నాయి. కొందరు నవరాత్రుల పాటు కొన్ని చోట్ల పూజలు చేస్తే.. ఇంకొందరు ఐదు రోజులు.. 11 రోజుల తర్వాత నిమజ్జనాలు చేస్తారు. రోజూ మాత్రమే కాదు.. నిమజ్జనానికి ముందు కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే.. బెంగళూరులో వినాయక చవితి సందర్బంగా ఓ జంట ఇంట్లో వినాయకుడి విగ్రహం నిలబెట్టి పూజలు చేసింది. ఈ క్రమంలోనే నిమజ్జనానికి ముందు ప్రత్యేక పూజలు చేశారు. పూజల్లో భాగంగా రూ.4లక్షల విలువైన బంగారు గొలుసు దేవుడి మెడలో వేశారు. ఆ తర్వాత మర్చిపోయి గొలుసుతో పాటుగా వినాయకుడిని నిమజ్జనం చేశారు.
బెంగళూరులోని విజయనగర ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. రామయ్య-ఉమాదేవి అనే దంపతులు ఇంట్లో వినాయకుడి విగ్రహం ప్రతిష్టించి పూజలు చేశారు. మొబైల్ ట్యాంకులో విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి ముందు విగ్రహం మెడలో రూ.4లక్షల విలువైన గొలుసును వేశారు. అయితే.. మర్చిపోయిన వారు గొలుసుతో పాటే విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లారు. గొలుసు గురించి ఆలోచించి.. నిమజ్జనం చేసినట్లుగా గుర్తు చేసుకున్నారు. దాంతో లబోదిబో అంటూ మొబైల్ ట్యాంకు వద్దకు వెళ్లారు. అక్కడ సిబ్బందితో విషయం చెప్పారు. అయితే.. ఆ సమయంలో అక్కడున్న ఓ కుర్రాడు విగ్రహం మెడలో గొలుసు చూశానని, కాకపోతే అది రోల్డుగోల్డుదని అనుకున్నానని చెప్పాడు.ఆ తర్వాత ఆ జంట పోలీసులు, ఎమ్మెల్యే ప్రియకృష్ణకు విషయం చెప్పారు. దీంతో ఆ గొలుసును వెతికి వారికి ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యే ఆదేశించారు.
ఎమ్మెల్యే ఆదేశాలతో మొత్తం 10 మంది మొబైల్ ట్యాంకులోకి దిగి గొలుసు కోసం వెతికారు. దాదాపు 10 గంటల తర్వాత చైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక దీని కోసం 10 వేల లీటర్ల నీటిని తోడాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు. అప్పటికే 300 విగ్రహాలను నిమజ్జనం చేయడంతో.. బంగారం గొలుసును వెతకడం ఇబ్బంది అయ్యిందని చెప్పారు. చివరకు బంగారం గొలుసు దొరకడంతో ఆ జంట సంతోషం వ్యక్తం చేసింది.