ఈవీఎంలకు బీజేపీ ట్యాగ్‌లపై ఈసీ వివరణ.. ఏం చెప్పిందంటే..
దేశంలో మే 25వ తేదీ శనివారం ఆరో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగింది.
By Srikanth Gundamalla Published on 26 May 2024 8:11 AM ISTఈవీఎంలకు బీజేపీ ట్యాగ్‌లపై ఈసీ వివరణ.. ఏం చెప్పిందంటే..
దేశంలో మే 25వ తేదీ శనివారం ఆరో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా బెంగాల్‌లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కాగా.. బెంగాల్‌లో కొన్ని ఈవీఎంలకు బీజేపీ అని రాసి ఉన్న ట్యాగ్‌లు దుమారం రేపాయి. దీనిపై టీఎంసీ తీవ్రంగా మండిపడింది. ఎక్స్‌లో ఈ ఫొటోలను షేర్ చేస్తూ పలు అనుమానాలను వ్యక్తం చేసింది. ఈ అంశం దేశవ్యాప్తంగా వివాదంగా మారడంతో.. బెంగాల్ ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇచ్చారు.
ఈవీఎంలపై బీజేపీ ట్యాగ్‌లు ఉండటం వెనుక ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని చెప్పారు బెంగాల్ ఎలక్షన్ కమిషన్ అధికారులు. పోలింగ్‌ను సక్రమంగా నిర్వహించినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్‌లను పెట్టేటప్పుడు అక్కడ ఉన్న అన్ని పార్టీల అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లతో అడ్రస్ ట్యాగల్‌పై సంతకాలు చేయిస్తామని ఈసీ తెలిపింది. ఇందులో భాగంగా 56, 58, 60, 61, 62 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం, వీవీప్యాట్‌లు పెట్టేటప్పుడు బీజేపీ అభ్యర్థికి సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు మాత్రమే ఉన్నారని చెప్పింది. అందుకే ముందుగా వారితో సంతకాలు తీసుకున్నామని బెంగాల్ ఎలక్షన్ కమిషన్ తెలిపింది. పోలింగ్ జరిగేటప్పుడు ఇక మిగతా అందరి ఏజెంట్ల సంతకాలు కూడా పెట్టించామని వివరణ ఇచ్చింది. ఈ ప్రక్రియలు ఎన్నికల సంఘం నిబంధనలు అన్నింటినీ పాటించామని బెంగాల్ ఎలక్షన్ కమిషన్ పేర్కొంది.