హెలికాప్టర్‌ ఎక్కుతూ జారిపడ్డ బెంగాల్ సీఎం మమత (వీడియో)

ప్రచారానికి వెళ్తున్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుకోకుండా కిందపడిపోయారు.

By Srikanth Gundamalla
Published on : 27 April 2024 5:07 PM IST

bengal, cm mamata banerjee, fell down,  helicopter,

 హెలికాప్టర్‌ ఎక్కుతూ జారిపడ్డ బెంగాల్ సీఎం మమత (వీడియో)

దేశంలో సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలోనే పార్టీల అధినేతలు ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. కార్యకర్తల నుంచి అందరు నాయకులు విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారు. ఈక్రమంలోనే ప్రచారానికి వెళ్తున్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుకోకుండా కిందపడిపోయారు. పశ్చిమ బర్దమాన్‌ జిల్లాలోని దుర్గాపూర్‌ నుంచి అసన్‌ సోల్‌కు వెళ్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే పశ్చిమ బర్దమాన్‌ జిల్లాలోని దుర్గాపూర్‌ నుంచి అసన్‌ సోల్‌కువెళ్లేందుకు మమతా బెనర్జీ హెలికాప్టర్‌లో ప్రయాణం చేయాల్సి ఉంది. దాంతో.. ఆమె హెలికాప్టర్‌ వెళ్లేందుకు ముందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే లోపలికి ఎక్కిన మమతా బెనర్జీ సీట్లో కూర్చునే సమయంలో ఒక్కసారిగా పట్టుకోల్పోయి కిందపడ్డారు. మమతా బెనర్జీ కిందపడిపోవడంతో అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్‌ అయ్యారు. ఆమెకు సాయం అందించారు.

హెలికాప్టర్‌లోనే కిందపడ్డ దీదీని పైకి లేపి యథావిధిగా సీట్లో కూర్చోబెట్టారు. ఈ సంఘటనలో మమతాబెనర్జీకి చిన్న గాయం అయ్యిందని టీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. గాయం అయినా కూడా మమతా బెనర్జీ తన ప్రయాణాన్ని ఆపలేదు. తన ప్రచారాన్ని ముందుకు కొనసాగించారు. అనంతరం అసన్‌సోల్‌కు వెళ్లి అక్కడ ప్రచారంలో పాల్గొన్నట్లు టీఎంసీ వర్గాలు చెప్పాయి. కాగా.. దీదీ హెలికాప్టర్‌లో కిందపడ్డ వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. టీఎంసీ కార్యకర్తలు ఆందోళన చెందారు. తర్వాత ఆమెకు పెద్దగా గాయాలు కాలేదని తెలియడంతో ఊపిరితీసుకున్నారు. అసన్‌సోల్‌ నియోజకవర్గం నుంచి టీఎంసీ తరఫున నటుడు, సిట్టింగ్ ఎంపీ శత్రుఘ్న సిన్హా పోటీ చేస్తున్నారు.


Next Story