మాస్క్‌ ఉంటే నో ఎంట్రీ.. మాల్స్, సూపర్‌మార్కెట్స్‌ నిర్ణయం

సూపర్‌మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌ ఎదుట ఈ నో మాస్క్‌ ఎంట్రీ అంటూ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on  2 Sept 2024 9:00 AM IST
మాస్క్‌ ఉంటే నో ఎంట్రీ.. మాల్స్, సూపర్‌మార్కెట్స్‌ నిర్ణయం

కరోనా వల్ల ప్రపంచ దేశాలు వణికిపోయాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడంతో.. వైరస్ బారిన పడకుండా ఎప్పుడు బయటకు వచ్చినా మాస్క్‌ ధరించాం. ఇప్పటికీ కరోనా పూర్తిగా అంతరించిపోలేదు. కానీ.. మాస్క్‌లను ఎవరూ వాడటం లేదు. కోవిడ్‌ భారీ ఎత్తున వ్యాపిస్తున్న సమయంలో మాస్క్‌ లేనిదే ఎక్కడికీ ఎంట్రీ ఉండేది కాదు. సినిమా హాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్‌ ఇలా ఎక్కడికి వెళ్లినా మాస్క్‌ మస్ట్. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒక చోట మాస్క్‌ ఉంటే లోనికి ప్రవేశం లేదని అంటున్నారు. మాస్క్‌ ఉంటే ప్రాబ్లం ఏంటీ అనుకుంటున్నారా..? అయితే ఇది తెలుసుకోంది.

బెంగళూరులోని చాలా సూపర్‌మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌ ఎదుట ఈ నో మాస్క్‌ ఎంట్రీ అంటూ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. అంటే మాస్కులు ఉంటే లోనికి ప్రవేశం లేదని అంటున్నారు. దీని వెనుక కారణం లేకపోలేదు. ఇటీవల కాలంలో దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి. వైరస్‌ నుంచి రక్షణ అనే పేరుతో మాస్కులు ధరించి కొందరు మాల్స్‌లో చోరీలకు పాల్పడుతున్నారు. సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు అయినా.. మాస్క్‌లు ఉండటం వల్ల వారిని గుర్తించడం కష్టం అవుతోంది. ఈ నేపథ్యంలోనే మాస్క్‌లతో వచ్చే వారిని అనుమతించడం లేదని కంగేరిలోని ఒక షాపింగ్‌ మాల్‌ యాజమాని తెలిపారు. పోలీసులు కూడా మాస్క్‌లు ధరించి ఉంచడం వల్ల చోరీలకు పాల్పడే వారిని గుర్తించడం కష్టం అవుతోందని వెల్లడించారు. మరోవైపు ఇటీవల రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడులో కూడా నిందితుడు మాస్క్‌ ధరించే ఉన్నాడు. దొంగలకు ఇదొక యూనిఫామ్‌ అయ్యిందని పోలీసులు అంటున్నారు. ఇక బెంగళూరులో మాల్స్‌, సూపర్‌ మార్కెట్లు ఇలాంటి బోర్డులు పెట్టడం చర్చనీయాంశం అయ్యింది. కొందరు దీనిని వ్యతిరేకిస్తున్నారు. అసలే ఇది సీజనల్ వ్యాధులు ప్రబలే సమయం అనీ.. ఇలాంటి సమయాల్లో జాగ్రత్తలు వహించొద్దని చెప్పడం సరికాదంటున్నారు.

Next Story