ఆరు ట్రంకు పెట్టెలతో వచ్చి.. జయలలిత బంగారం తీసుకెళ్లండి: కోర్టు
జయలలిత అక్రమాస్తుల్లో భాగమైన బంగారు, వజ్రాభరణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్నికి బెంగళూరు కోర్టు ఆదేశాలను జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 20 Feb 2024 4:18 PM ISTఆరు ట్రంకు పెట్టెలతో వచ్చి.. జయలలిత బంగారం తీసుకెళ్లండి: కోర్టు
తమిళనాడు దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల్లో భాగమైన బంగారు, వజ్రాభరణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్నికి బెంగళూరు సివిల్ కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. మార్చి 6, 7వ తేదీల్లో వచ్చి బంగారు, వజ్రాభరణాలను తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీటిని తీసుకెళ్లేందుకు ఆరు ట్రంకు పెట్టెలతో రావాల్సి ఉంటుందని సూచించింది. కాగా.. ఆ రెండ్రోజుల్లో ఇతర ఇతర కేసులను వాదించకూడదని బెంగళూరు సివిల్ అండ్ సెషన్స్ కోర్టు నిర్ణయం తీసుకుంది.
బంగారు ఆభరణాలను తీసుకెళ్లేందుకు అధికారిని నియమించామనీ.. తమిళనాడు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజీపీ ఆ అధికారితో సమన్వయం చేసుకోవాలని న్యాయమూర్తి తెలిపారు. ఆరు పెద్ద ట్రంకు పెట్టెలతో పాటు అవసరైమన సిబ్బంది, ఫొటో గ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ ను తీసుకురావాలని ప్రభుత్వానికి బెంగళూరు సివిల్ కోర్టు సూచిచింది. భద్రతా పరమైన విషయంలోనూ పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
కాగా.. అక్రమార్జన కేసులో 1996 లో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న ఆభరణాలన్నీ కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. వీటిలో 468 రకాల బంగారు, వజ్రాభరణాలు, 700 కిలోల వెండి వస్తువులు, 740 ఖరీదైన చెప్పులు, 11,344 పట్టుచీరలతో పాటు రిఫ్రిజిరేటర్లు, టీవీ సెట్లు, సీడీ ప్లేయర్లు ఇంకా కొన్ని వస్తువులు, రూ.1,93,202 నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్రమాస్తుల కేసులో జయలలితకు 2014లో బెంగళూరు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. స్వాధీనం చేసుకున్న వస్తువులను ఆర్బీఐ లేదా ఎస్బీఐ లేదంటే బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని చెప్పింది. కానీ.. ఇంతలోనే ఆమె మరణించారు. ఇక మరోసారి విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి ఆభరణాలను అందించాలని ఆదేశాలను జారీ చేసింది.