లుంగీలు, నైటీలపై బ్యాన్..సర్క్యులర్ జారీ..ఎక్కడంటే..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఓ అపార్ట్‌మంట్ ఈ సర్క్యులర్ జారీ చేసింది. కాలనీలో ఎవరూ లుంగీలు, నైటీలు
By Srikanth Gundamalla Published on 14 Jun 2023 4:54 PM ISTలుంగీలు, నైటీలపై బ్యాన్..సర్క్యులర్ జారీ..ఎక్కడంటే..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఓ అపార్ట్‌మంట్ ఈ సర్క్యులర్ జారీ చేసింది. కాలనీలో ఎవరూ లుంగీలు, నైటీలు ధరించి తిరగొద్దని కోరింది. వినడానికి ఇది వింతగానే ఉన్నా నిజంగానే జరిగింది.
ఎలాంటి దుస్తులు ధరించాలనేది సొంత నిర్ణయం. ఎవరో ఏదో చెప్పారని పాటించాలని చూడరు ఎవరూ. అలాంటిది ఓ అపార్ట్‌మెంట్ పరిసరాల్లో లుంగీలు, నైటీలు ధరించితిరగొద్దని సర్క్యులర్ జారీ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన లెటర్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. నోయిడాలోని సదురు అపార్ట్‌మెంట్ నిర్వాహకులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం లేకపోలేదు.
యూపీలోని గ్రేటర్ నోయిడాలో హిమసాగర్ అపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ దాదాపు 200కి పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. ఎండలు ఎక్కువగా ఉన్నందున చాలా మంది ఉదయం, సాయంత్రం వేళ అపార్ట్‌మెంట్ పరిసరాల్లో, పార్కింగ్ ఏరియాల్లో కాసేపు చల్లగాలికి తిరగసాగారు. ఇళ్లలో ధరించే లుంగీలు, నైటీల్లోనే ఎక్కువ మంది బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చారు. అయితే.. పురుషులు లుంగీలు ధరించి తిరగడం, మహిళలు నైటీలు వేసుకునే బయటకు రావడంపై కొందరు అభ్యంతరకరంగా, అసౌకర్యంగా ఉందని అపార్ట్‌మెంట్ నిర్వాహకులకు కంప్లైంట్ చేశారు. దీనిపై స్పందించిన నిర్వాహకులు.. ఇకపై ఎవరూ లుంగీలు, నైటీలు ధరించి అపార్ట్‌మెంట్ పరిసరాల్లో తిరగరాదని సర్క్యులర్ జారీ చేశారు. జూన్ 10న జారీ చేసిన ఈ సర్క్యులర్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
తాము ఎవరినీ తప్పుబట్టడం లేదనీ, అపార్ట్‌మెంట్ పరిసర ప్రాంతాల్లో ఎవరికీ ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అపార్ట్‌మెంట్ వాసులు ధరించే దుస్తులు, ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ పెడతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకేసారి సర్క్యులర్ ఇవ్వలేదని... ఈ విషయంపై పలుమార్లు చెప్పినా ఎవరూ వినకపోవడంతోనే సర్క్యులర్ ఇవ్వాల్సి వచ్చిందని అపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్ తెలిపారు. కాగా.. ఈ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుంటే.. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.