జనవరి 22న అయోధ్యకు రావొద్దు..ఆలయ ట్రస్ట్ సెక్రటరీ సంచలన ప్రకటన

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో రామాయల నిర్మాణం జరుగుతోంది.

By -  Srikanth Gundamalla
Published on : 17 Dec 2023 11:49 AM IST

ayodhya temple january 22nd temple trust secretary

 జనవరి 22న అయోధ్యకు రావొద్దు..ఆలయ ట్రస్ట్ సెక్రటరీ సంచలన ప్రకటన

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో రామాయల నిర్మాణం జరుగుతోంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరుగుతోంది. దాదాపు పనులు అన్నీ పూర్తి అయ్యాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా అయోధ్య రామాలయాన్ని నిర్మించారు. అయితే.. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయ్యింది. 2024 ఆరంభంలోనే అంటే జనవరి 22న ఈ అయోధ్య ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ట్రస్ట్‌ సభ్యులు. ప్రతిష్టాత్మక ఆలయం కావడం ద్వారా రాముడి భక్తులు ప్రారంభోత్సవానికి వెళ్లడానికి సిద్ధం అవుతున్నారు. ఈ సమయంలో ఆలయ ట్రస్ట్‌ సెక్రటరీ సంచలన ప్రకటన చేశారు.

అయోధ్యలో కేవలం రాములోరి గర్భగుడి నిర్మాణం మాత్రమే పూర్తయ్యిందని రామమందిర ట్రస్ట్‌ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించే ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. అయితే గర్భగుడి మినహా మిగతా ఆలయ పనులు అసంపూర్తిగా వున్నాయని చెప్పారు. ఇవి మొత్తం పూర్తయ్యేందుకు మరో రెండేళ్లు పడుతుందని చెప్పారు. ఈ క్రమంలో 2024 జనవరి 22న అయోధ్య రామమందిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చేసేందుకు సిద్ధమవుతున్న భక్తులకు చంపత్‌ రాయ్‌ ఒక సూచన చేశారు. అయోధ్యకు రావడం కంటే తమ సమీపంలోని ఆలయాల్లోనే ఆనంద మహోత్సవం జరుపుకోవడం ఉత్తమం అని చెప్పారు. అయోధ్యలో భక్తుల రద్దీ పెరిగి ఆందోళన పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయని దాంతో ఈ పిలుపునిచ్చారు.

అయోధ్య రామమందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు వారం రోజుల ముందు నుంచే ప్రారంభం అవుతాయి. జనవరి 16 నుంచి వారణాసికి చెందిన లక్ష్మీకాంత్‌ దీక్షిత్ నేతృత్వంలో అయోధ్యలో పూజలు మొదలవుతాయి. వారంరోజుల పాటు నిర్విరామంగా పూజలు చేసి రాముడి విగ్రహాన్ని గర్భాలయంలో ప్రతిష్టించనున్నారు. ఆలయ ప్రారంభోత్సవం కోసం వచ్చే ప్రధాని, ఇతర ప్రముఖుల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

Next Story