అయోధ్యలో భక్తుల రద్దీ, క్యూలైన్లపై టీటీడీ సూచనలు

అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట తర్వాత దర్శనాలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  19 Feb 2024 11:39 AM IST
ayodhya temple, heavy que line, devotees, ttd ,

అయోధ్యలో భక్తుల రద్దీ, క్యూలైన్లపై టీటీడీ సూచనలు

అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట తర్వాత దర్శనాలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. చరిత్రాత్మక ఆలయం కావడంతో ఇక్కడ బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో బాల రాముడి దర్శనానికి చాలా సమయం పడుతోంది. మరోవైపు కొత్త ఆలయం కావడంతో భక్తులకు కొంత ఇక్కట్లు తప్పడం లేదు. కీలో మీటర్ల మేర క్యూలైన్లు దర్శనం ఇస్తున్నాయి.

పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులు వస్తుండటంతో ఆలయం వద్ద క్యూ మేనేజ్‌మెంట్ నిర్వహణ, ఇతర సౌకర్యాల ఏర్పాటులో సాంకేతిక సాయం అందించాలని, భక్తుల రద్దీ క్రమబద్దీకరణ, ఇతర అంశాలపై అవగాహన కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అయోధ్య రామమందిర ట్రస్ట్‌ కోరింది. దాంతో.. టీటీడీ ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం అయోధ్యలోని రామజన్మభూమి ట్రస్ట్‌ ప్రతినిధులకు భక్తుల రాక నియంత్రణతో పాటు క్యూలైన్ల నిర్వహణపై పలు సూచనలు చేశారు.

అయితే.. బాలరాముడికి మధ్యాహ్నం ఒక గంటసేపు విశ్రాంతి ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ మధ్యామ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు బాల రాముడికి విశ్రాంతి ఇస్తున్నారు. ఆ సమయంలో దేవాలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు ఇప్పటికె చెప్పారు. ముందుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు మాత్రమే దర్శనాలకు అనుమతి ఇచ్చారు. ప్రాణప్రతిష్ట తర్వాత భక్తుల రద్దీ పెరగడంతో దర్శనం వేళలను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పొడిగించారు. బాల రాముడికి తెల్లవారు జామున 4 గంటల నుంచి 2 గంటల సేపు హారతి, అర్చన నిర్వహిస్తున్నారు.

Next Story