Ayodhya Ram Mandir: ఆహ్వానితులకు ప్రత్యేక ప్రసాదం బాక్స్‌లు
అయోధ్యలో రామందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 22 Jan 2024 11:59 AM ISTAyodhya Ram Mandir: ఆహ్వానితులకు ప్రత్యేక ప్రసాదం బాక్స్‌లు
అయోధ్యలో రామందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఈ మహోత్సవానికి ప్రముఖులు ఎందరో హాజరు అయ్యారు. ఇక అయోధ్య మొత్తం రామ నామస్మరణతో మారుమ్రోగుతోంది. ఎక్కడ చూసిన రామభక్తులు జైశ్రీరామ్ అంటూ జపం చేస్తున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ భద్రత ఏర్పాట్లు చేశారు. రామమందిర ప్రారంభోత్సవంలో పాల్గొనే ఆహ్వానితులకు ప్రత్యేకంగా ప్రసాదం బాక్స్‌లను సిద్ధం చేశారు అయోధ్య రామాలయ అధికారులు. ఇందులో లడ్డూలు, దీపపు కుందెతో పాటు ఏడు రకాల వస్తులు ఉంటాయి.
లక్నోలోని ప్రముఖ స్వీట్‌షాపు ‘ఛప్పన్ భోగ్’ ఈ బాక్సులను సిద్ధం చేసింది. అయితే.. ఒక్కో బాక్సులో రెండు నేతి లడ్డూలు, గుర్‌రెవ్డీ, రామ్దానా చిక్కీ, అక్షింతలు, రోలీ, తులసీ దళాలు, దీపపు కుందె, తీపి యాలకులు ఉంటాయి. కాషాయ రంగులో ఈ బాక్సు ఉంటుంది. బాక్సుపై శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు, హనుమాన్ గర్హీ లోగోలు ఉంటాయి. ప్రత్యేకంగా తయారు చేసిన బ్యాగులో వీటిని ఉంచి రామందిర ప్రారంభోత్సవానికి వచ్చిన ఆహ్వానితులకు ప్రత్యేకంగా అందించనున్నారు.
ఈ స్పెషల్ ప్రసాదం బాక్సులను మొత్తం 15వేలకు పైగా ఆర్డర్ చేశారు. ఇక రామందిరం ప్రారంభోత్సవం సందర్భంగా.. చారిత్రాత్మక ఘట్టం కావడంతో సదురు ‘ఛప్పన్ భోగ్’ నిర్వాహకులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవకాశం తమకు రావడం అదృష్టమంటున్నారు. దాంతో.. నిర్వాహకులు ఈ 15వేల ప్రసాదం బాక్సులను ఉచితంగానే ఇస్తామని ముందుకొచ్చారు. అతిథులకు ప్రసాదం బాక్సుతో పాటు మహా ప్రసాదం, నేతితో చేసిన ఆహారం కూడా అందించున్నారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో గుజరాత్‌కు చెందిన భారతీ గర్వీ గుజరాత్, సంత్ సేవా సంస్థాన్ మహా ప్రసాదాన్ని సిద్ధం చేస్తున్నాయి. ఇక మరోవైపు రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు నెలకొన్నాయి. భక్తులు రాముడిని దర్శించుకున్నారు. ఇళ్లలో ప్రత్యేక పూజలు చేసుకున్నారు.