అయోధ్య గర్భగుడిలోకి రామ్‌లల్లా విగ్రహం
అయోధ్యలో రామమందిర ప్రారంభ మహోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 18 Jan 2024 9:26 AM ISTఅయోధ్య గర్భగుడిలోకి రామ్‌లల్లా విగ్రహం
అయోధ్యలో రామమందిర ప్రారంభ మహోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. గురువారం అయోధ్య రామాలయం గర్భగుడిలోకి ప్రధాన రామ్‌లల్లా విగ్రహం చేరింది. వేద మంత్రోచ్ఛారణ, జైరామ్ నినాదాల మధ్య గురువారం తెల్లవారుజామున విగ్రహాన్ని ఆలయంలోకి తీసుకొచ్చినట్లు రామమందిర నిర్మాణ కమిటీ పేర్కొంది. విగ్రహాన్ని ట్రక్కులో ఆలయానికి తీసుకొచ్చి.. ఆ తర్వాత క్రేన్ సాయంతో గర్భగుడిలో చేర్చినట్లు తెలిపారు. కాగా.. రామ్‌లల్లా విగ్రహాన్ని గురువారం గర్భగుడిలో ప్రతిష్టించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జనవరి 22న ప్రాణప్రతిష్‌ట వేడుక ముందు వరకూ పూజా కార్యక్రమాలను నిర్వహిస్తాని ఆలయ కమిటీ తెలిపింది. ప్రస్తుతం ఏడు రోజుల పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
విగ్రహాన్ని క్రేన్ సాయంతో గర్భగుడి ప్రాంగణంలోకి తెచ్చారు. ఆ సమయంలో భక్తులు పెద్ద ఎత్తున ‘జై శ్రీరాం’ నినాదాలు చేశారు. విగ్రహాన్ని తీసుకువచ్చే ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 150 నుంచి 200 కిలోల బరువున్న రామ్ లల్లా విగ్రహాన్ని సాయంత్రం ఊరేగింపుతో ఆలయానికి తీసుకువచ్చారు. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని చేతుల మీదుగా జరగనుండగా.. ముందుగా శ్రీరాముని విగ్రహం కళ్లకు ఉన్న గంతలు విప్పి దర్శనం చేసుకున్న తర్వాత మోదీ హారతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
జనవరి 21 వరకు పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని, 'ప్రాణప్రతిష్ఠ' రోజున కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయని ఆలయ ట్రస్టు అధికారులు తెలిపారు. రామాలయం 'ప్రాణ ప్రతిష్ఠ' కార్యక్రమం జనవరి 22న మధ్యాహ్నం 12:20 గంటలకు మొదలై మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగుతుంది. కాగా.. ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాన్ని పురస్కరించుకుని కేరళలోని శ్రీ పద్మనాభ స్వామి దేవాలయం అయోధ్య రామునికి సంప్రదాయ ఆచార విల్లు ‘ఓనవిల్లు’ను బహూకరించనుంది. ఈ నెల 18న అయోధ్యలో దీనిని ఆలయ నిర్వాహకులు అయోధ్య ట్రస్ట్‌కు అందజేస్తారు.