అయోధ్యలో ఏడురోజుల పాటు ప్రాణప్రతిష్ట మహోత్సవాలు.. వివరాలివే
అయోధ్య రామాలయ మందిరం ప్రారంభోత్సవానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
By Srikanth Gundamalla
అయోధ్యలో ఏడురోజుల పాటు ప్రాణప్రతిష్ట మహోత్సవాలు.. వివరాలివే
అయోధ్య రామాలయ మందిరం ప్రారంభోత్సవానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామాలయ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రామాలయ ట్రస్ట్ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రముఖలు హాజరుకానున్నారు. ఇప్పటికే ఎంతో మందికి ఆలయ ట్రస్ట్ అధికారులు ఆహ్వానం పంపారు. జనవరి 22న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం జరగనుంది.
ప్రధాని నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న రామాలయానికి భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 22న బాలరాముడు ఆలయంలో ప్రతిష్టుతుడు కానున్నారు. ఆలయ ట్రస్ట్ ఈ వేడుకకు 7వేలకు పైగా మంది అతిథులను ఆహ్వానించింది. క్రీడాకారులు, రాజకీయ నాయకులు, సినీతారలతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. కాగా.. రామాలయ ప్రారంభోత్సవం కోసం ఏడు రోజుల పాటు జరిగే రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి.
జనవరి 16 (మొదటిరోజు) కార్యక్రమాలు
జనవరి 16 నుంచి రామాలయ ప్రతిష్టాపన వేడుకలు ప్రారంభం అవుతాయి. సరయూ నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణూపూజ మొదలైన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
జనవరి 17 (రెండో రోజు) కార్యక్రమాలు
రామ్‌లల్లా విగ్రహాన్ని ఊరేగిస్తారు.. ఆ తర్వాత అయోధ్యకు తీసుకొస్తారు. మంగళ కలశాలలో సరయూ జలాన్ని నింపి, వాటితో పాటు భక్తులు రామాలయానికి చేరుకోనున్నారు.
జనవరి 18 (మూడోరోజు) కార్యక్రమాలు
గణేశ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, బ్రాహ్మణ వరం, వాస్తు పూజలతో వైదిక ఆచారాలు ప్రారంభమవుతాయి.
జనవరి 19 (నాలుగో రోజు) కార్యక్రమాలు
అయోధ్యలో జనవరి 19న పవిత్రమైన అగ్నిని వెలిగిస్తారు. ఆ తరువాత 'నవగ్రహ' స్థాపన చేయనున్నారు.
జనవరి 20 (ఐదవ రోజు)
జనవరి 20న రామజన్మభూమి ఆలయ గర్భగుడిని సరయూ నీటితో సంప్రోక్షణ చేస్తారు ఆలయ అర్చకులు. ఆ తర్వాత వాస్తు శాంతి నిర్వహిస్తారు.
జనవరి 21 (ఆరో రోజు) కార్యక్రమాలు
రామ్‌లల్లా విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయించి, పవళింపజేస్తారు.
జనవరి 22 (ఏడవ రోజు)కార్యక్రమాలు
జనవరి 22న రాములవారి విగ్రహప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది. ప్రధాన 'ప్రాణ ప్రతిష్ట' వేడుక మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కానుంది. రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. సంప్రోక్షణ కార్యక్రమానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా.. జనవరి 21, 22వ తేదీల్లో సాధారణ భక్తులను రామాలయంలోకి అనుమతించరట. ఆ తర్వాత 23వ తేదీ నుంచి కొత్త రామాలయంలోకి భక్తులందరికీ అనుమతి ఉండనుంది.