అయోధ్య ఆలయం కోసం 400కిలోల తాళం చేసిన రామ భక్తుడు

అయోధ్య రామమందిరం కోసం యూపీకి చెందిన ఒక భక్తుడు 400 కిలోల తాళం తయారు చేశాడు.

By Srikanth Gundamalla  Published on  7 Aug 2023 12:15 PM IST
Ayodhya, Ram Mandir, 400 KG Lock, UP Person,

అయోధ్య ఆలయం కోసం 400కిలోల తాళం చేసిన రామ భక్తుడు

భక్తులు తమ ఇష్ట దైవం పట్ల భక్తితో కానుకలు సమర్పించుకుంటారు. కొందరు భారీ మొత్తంలో బంగారం ఇస్తుంటారు. ఇంకొందరు ఆలయానికి అవసరమైన పనులు చేయిస్తారు. అయితే.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ రామ భక్తుడు అయోధ్య రామమందిరం కోసం భారీ తాళాన్ని తయారు చేశాడు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 400 కిలోల బరువున్న తాళం తయారు చేశాడు. త్వరలోనే ఆలయ అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపాడు.

తమిళనాడులోని దిండిగల్‌ నగరం తాళాల పరిశ్రమకు ప్రిసిద్ధి చెందినది. అలాగే యూపీలోని అలీఘర్‌ కూడా తాళాల పరిశ్రమకు పేరుంది. ఈ నగరానికి చెందిన సత్యప్రకాశ్‌ అనే వ్యక్తి కూడా తాళాలను తయారు చేస్తున్నాడు. ఈ వ్యాపారంలో తమ కుటుంబం వంద ఏళ్లకు పైగా ఉంది అని సత్యప్రకాశ్‌ చెబుతున్నాడు. అయితే.. సత్యప్రకాశ్‌ తాళాల తయారీ నిపుణుడు.. వ్యాపారస్తుడే కాదు.. రాముడికి భక్తుడు. అయోధ్యలో రామమందిరం నిర్మించిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ రామమందిరానికి తన వంతుగా ఏదైనా ఇవ్వాలని అనుకున్నాడు సత్యప్రకాశ్‌. అంతేకాదు.. తాను ఇవ్వబోయేది ప్రపంచంలో ఎక్కడా లేనిది అయ్యి ఉండాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే భారీ తాళం తయారు చేసేందుకు పూనుకున్నాడు.

దాంతో.. సత్యప్రకాశ్‌ శర్మ కొన్ని నెలలపాటు శ్రమించి ప్రపంచంలోనే అతి పెద్దదైన చేతితో తయారు చేసిన తాళాన్ని సిద్ధం చేశాడు. పది అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడెల్సు, 9.5 అడుగుల మందంతో తాళాన్ని తయారు చేశాడు. ఇక నాలుగు అడుగుల తాళం చెవిని తయారు చేశాడు సత్యప్రకాశ్‌ శర్మ. ఈ తాళాన్ని తయారు చేసేందుకు కొన్ని నెలల సమయం పట్టిందని చెబుతున్నాడు శర్మ. ప్రస్తుతం తాళానికి సంబంధించి చిన్నచిన్న మార్పులు, ఆలయం కోసం తయారు చేస్తున్నది కాబట్టి కొన్ని అలంకరణలు చేస్తున్నట్లు సత్యప్రకాశ్ తెలిపాడు. ఈ భారీ తాళం తయారు చేడంలో తన భార్య రుక్మిణి ఎంతగానో సహకరించిందని పేర్కొన్నాడు. దీని కోసం రూ.2లక్షలు వెచ్చించినట్లు తెలిపాడు సత్యప్రకాశ్ శర్మ. కాగా.. ఈ భారీ తాళాన్ని ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించిన వార్షిక అలీగఢ్‌ ప్రదర్శనలో కూడా ఉంచారు.

వచ్చే ఏడాది జనవరి 21, 22, 23 తేదీల్లో రామమందిరంలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ తెలిపింది. ఈ వేడుకకు దాదాపు 10,000 మంది అతిథులను బోర్డు ఆహ్వానిస్తుందని రామమందిర్ బోర్డు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు.

Next Story