నేను తాత్కాలికమే.. కేజ్రీవాలే మళ్లీ సీఎం అవుతారు: అతిషి

ఢిల్లీ కొత్త సీఎంగా అతిషిని కేజ్రీవాల్ ఎంపిక చేశారు.

By Srikanth Gundamalla  Published on  17 Sept 2024 3:51 PM IST
నేను తాత్కాలికమే.. కేజ్రీవాలే మళ్లీ సీఎం అవుతారు: అతిషి

ఢిల్లీ కొత్త సీఎంగా అతిషిని కేజ్రీవాల్ ఎంపిక చేశారు. అయితే.. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగేంత వరకు మాత్రమే తాను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటానని చెప్పారు. ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తారనీ.. తద్వారా మళ్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ బాధ్యతలు చేపడతారని అతిషి చెప్పారు. తాను ఇతర పార్టీల్లో ఉన్నట్లయితే కనీసం టిక్కెట్ కూడా దక్కకపోయేదని అన్నారు. కానీ కేజ్రీవాల్ తనకు టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారని చెప్పారు. ఆ తర్వాత మంత్రిని చేశారు.. ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా చేశారని అతిషి పేర్కొన్నారు. తనకు ముఖ్యమంత్రి బాధ్యతలు ఇచ్చినందుకు కేజ్రీవాల్‌కు అతిషి కృతజ్ఞతలు తెలిపారు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు.

తనపై నమ్మకం ఉంచిన కేజ్రీవాల్‌కు అతిషి ధన్యవాదాలు చెప్పారు. ఈ అవకాశం కేవలం ఆమ్ ఆద్మీ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనకు ఈ అవకాశం కల్పించడం పార్టీ గొప్పదనమని పేర్కొన్నారు. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయడం తనకు ఎంతో బాధ కలిగించిందని అతిషి చెప్పారు. తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టానని అభినందించవద్దని, పూలమాలలు అవసరం లేదని సూచించారు అతిషి. ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి మాట్లాడిన అతిషి.. మద్యం పాలసీ కేసులో తప్పుడు ఆరోపణలతో కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వంతో పాటు, దర్యాఫ్తు సంస్థలకు చెంపపెట్టు అన్నారు. కేజ్రీవాల్ స్థానంలో మరొకరు ఉంటే సీఎం పదవిని వదులుకునే వారు కాదనీ అతిషి చెప్పారు.

Next Story