గృహ నిర్భంధంలో క్రేజీవాల్.. !
Arvind Kejriwal under house arrest.. రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవా
By సుభాష్ Published on 8 Dec 2020 1:28 PM ISTరైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తెలిపారు. నిరసన చేస్తున్న రైతులను పరామర్శించినందుకే సీఎంను హౌస్ అరెస్ట్ చేశారన్నారు. సోమవారం సాయంత్రం నుంచి ఆయన నివాసంలోకి ఎవ్వరినీ అనుమతించడం లేదన్నారు. అలాగే క్రేజీవాల్‌ను సైతం ఇంటి నుంచి బయటికి రానివ్వడం లేదని ఆరోపించారు. సింధూ ప్రాంతంలో రైతుల్ని పరామర్శించి సంఘీభావం తెలిపినప్పటి నుంచి ఆయన నివాసం వద్ద భారీ స్థాయిలో బలగాల్ని మోహరించారని వెల్లడించారు.
కేజ్రీవాల్ సింధూ ప్రాంతం నుంచి తిరిగి రాగానే పోలీసులు అతడి ఇంటిని చుట్టు ముట్టారని ఎవ్వరూ రావడానికి గానీ వెళ్ళడానికి గానీ వీలు పడకుండా బారికేడ్లు పెట్టారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరబ్ భరద్వాజ్ అన్నారు. 'అంతేకాకుండా ఎవ్వరిని లోపలికి పోనీయడం లేదని, అతడిని బయటకు రానివ్వడం లేదు. ఆయన్ను కలవడానికి వెళ్ళిన ఎమ్మెల్యేలను పోలీసులు కొట్టారు. సీఎంతో మీటింగ్ ఉన్నవారు అతడి నివాసం బయట కూర్చోవాల్సి వస్తుంద'ని భరద్వాజ్ అన్నారు. రైతులకు కావలసిన అవసరాలను చూశామని, స్టేడియంలలో వారిని ఉంచేందుకు చాలా కష్టపడ్డామనీ, వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తున్నామని ఆయన అన్నారు. అంతేకాకుండా కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులు మన దేశ ప్రజలే కావున వారికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలని ఆయన అన్నారు. అంతేకాకుండా రైతులను కలిసిన కేజ్రీవాల్ తాను అక్కడికి ఒక సీఎంలా రాలేదని, ప్రజా సేవకుడిలా వచ్చానని అన్నారు.
అయితే.. దీనిపై పోలీసులు స్పందించారు. కేజ్రీవాల్ గృహానిర్భంధంలో లేరని తెలిపింది. బంద్ నేపథ్యంలో ఆప్ కార్యకర్తలకు, ఇతర పార్టీలకు మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా బలగాల్ని మోహరించామని నార్త్ ఢిల్లీ డీసీపీ ఆంటూ ఆల్పోన్స్ స్పష్టం చేశారు.