కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై రాళ్ల దాడి
Arson-stone pelting at Congress leader Salman Khurshid's house.నైనిటాల్‌లోని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు
By M.S.R Published on 16 Nov 2021 12:01 PM GMTనైనిటాల్‌లోని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై పెద్ద ఎత్తున రాళ్లు రువ్వారు. దుండగులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఇంటికి నిప్పు పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సల్మాన్ ఖుర్షీద్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. తగలబడిన తలుపులు, ధ్వంసమైన కిటికీలను ఆ ఫొటోలు, వీడియోల్లో చూడొచ్చు. సల్మాన్ ఖుర్షీద్ స్పందిస్తూ, ఇది హిందూయిజం కానే కాదు అనడానికి ఈ విధ్వంసమే ఉదాహరణ అని పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీలేదని ఈ దాడి ఘటనే చెబుతోందని వివరించారు.
సల్మాన్ ఖుర్షీద్ తన ఇంటి చిత్రాలను తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తూ ఈ విషయాన్ని తెలిపాడు. సల్మాన్ ఖుర్షీద్ తన పుస్తకంలో హిందుత్వంపై చేసిన వ్యాఖ్యలు అతని ఇంటిని కూల్చివేసి, దహనం చేయడానికి దారితీశాయి. సల్మాన్ ఖుర్షీద్ 'సన్ రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్ హుడ్ ఇన్ అవర్ టైమ్స్' అనే పుస్తకం రాశారు. సనాతన ధర్మం, అసలైన హిందూయిజం ఎప్పుడో మరుగునపడిపోయాయని, రాజకీయ హిందూయిజం రాజ్యమేలుతోందని అన్నారు. ఐసిస్, బోకో హరామ్ వంటి ఉగ్రవాద సంస్థల ఇస్లామిక్ జిహాద్ కు ఇదేమీ తీసిపోదని వివరించారు. ఈ వ్యాఖ్యలతో బీజేపీతో పాటు పలువురు నేతలు మండిపడ్డారు. సల్మాన్ ఖుర్షీద్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా ఆయన నివాసంపై దాడి ఈ క్రమంలోనే జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాకేష్, కపిల్, మరో 20 మందిపై కేసులు నమోదు చేశామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీఐ (కుమావోన్) నీలేష్ ఆనంద్ తెలిపారు.