అర్నాబ్ గోస్వామికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఇంటీరియల్ డిజైనర్ ఆత్మహత్య కేసులో అరెస్టు అయిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. అర్నాబ్ గోస్వామితో సహా మరో ఇద్దరికి కూడా సుప్రీం కోర్టు బుధవారం మధ్యంత బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల వ్యక్తిగత పూచికత్తుతో ఈ బెయిల్ మంజూరైంది.
కాగా, ఈ కేసులో గత బుధవారం అరెస్టు అయి జైలులో ఉన్న అర్నాబ్‌కు నవంబర్ 18 వరకు రాయిగఢ్ జిల్లా కోర్టు జ్యుడిషియల్ కస్టడి విధించింది. అయితే మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, బాంబే హైకోర్టు తిరస్కరించింది. దీంతో అర్నాబ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అక్రమంగా తనను అరెస్టు చేసి వేధిస్తున్నారని, అవసరమనుకుంటే ఈ కేసు సీబీఐతో విచారణ జరిపించేందుకు ఆదేశించాలని ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని కొఓరారు. బాంబే హైకోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరణను ఆయన సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. 2018లో మూసివేసిన ఆత్మహత్య కేసును మళ్లీ బయటకు తీశారని గోస్వామి వాదిస్తున్నారు. దీంతో పిటిషన్‌ను విచారించిన సుప్రీం.. గోస్వామితో పాటు మరో ఇద్దరికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.