తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసు నిందితుడి ఎన్‌కౌంటర్
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 14 July 2024 12:30 PM ISTతమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసు నిందితుడి ఎన్‌కౌంటర్
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. చెన్నైలో ఈ హత్య ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే కొందరు దుండగులు వచ్చి ఆర్మ్‌స్ట్రాంగ్‌ను చంపేశారు. దేశవ్యాప్తంగా ఈ హత్య ఘటన సంచలనంగా మారింది. తాజాగా ఈ హత్య కేసుల్లో నిందితుల్లో ఒకరిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. చెన్నై దగ్గర పోలీసుల ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ తిరువేంగడం చనిపోయాడని అధికారులు వెల్లడించారు.
కాగా..ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో తిరువేంగడం ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. హత్య తర్వాత ఈ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చాలా కాలంగా ఆర్మ్‌స్ట్రాంగ్‌ను అనుసరించి రెక్కీ నిర్వహించారని పోలీసులు నిర్ధారించారు.ఆ తర్వాత హత్యకు ప్లాన్ చేశాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. జూలై 5న సాయంత్రం చెన్నైలో బహరింగంగా ఆర్మ్‌స్ట్రాంగ్‌ను చంపేశారు. కత్తులతో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. సంఘటనా స్థలిలో పెద్ద కత్తిని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా.. ఆర్మ్‌స్ట్రాంగ్ చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు.
ఇప్పటి వరకు ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. నిందితుల్లో పొన్నై బాలా, రాము, తిరువేంగడం, తిరుమల, సెల్వరాజ్, మణివణ్ణన్, సంతృప్తి, అరుల్ ఉన్నారని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. హత్యచేసిన సమయంలో నిందితులు ఫుడ్ డెలివరీ టీషర్ట్‌లు ధరించారని పోలీసులు చెప్పారు.