ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి రెండు రోజుల్లో వరుస బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేగుతోంది.
By Srikanth Gundamalla Published on 29 Oct 2023 9:41 AM ISTముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ భారత కుబేరుడు అని అందరికీ తెలిసిందే. అయితే.. ఈ మధ్య ఆయనకువరుసగా బెదిరింపులు వెళ్లడం కలకలం రేపుతోంది. ఆగంతకులు ముందుగా రూ.20 కోట్లు.. మరోసారి రూ.200 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అంతకుముందు కొన్నేళ్ల కిందట అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాల కలకలం రేగిన విషయం తెలిసిందే.
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి రెండు రోజుల్లో వరుస బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేగుతోంది. అక్టోబర్ 27న రూ.20 కోట్లు డిమాండ్ చేస్తూ బెదిరింపు మెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. తాము అడిగిన డబ్బులు ఇవ్వకపోతే తమ వద్ద షూటర్లు ఉన్నారంటూ బెదిరించే ప్రయత్నం చేశారు. దీనిపై ముకేశ్ అంబానీ వైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆగంతకులు మరోసారి రెచ్చిపోయారు. తాజాగా మళ్లీ ముకేశ్ అంబానీకి బెదిరింపు మెయిల్ పంపించారు. తొలి మెయిల్‌కు స్పందించపోవడంతో ఆ తర్వాత మెయిల్‌లో ఏకంగా రూ.200 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అడిగిన డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
అయితే.. ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. ఈ రెండు మెయిల్స్ ఒకే ఖాతా నుంచి వచ్చాయని, షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడినట్లు గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతేడాది కూడా అంబానీ కుటుంబానికి ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. 2022 ఆగస్టు 15న రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని హర్‌కిసాన్‌దాస్ ఆస్పత్రికి బెదిరింపు ఫోన్ వచ్చింది. ఆసుపత్రిని పేల్చేస్తామని, అంబానీ కుటుంబాన్ని చంపేస్తామని ఆగంతకుడు బెదిరించాడు. అప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.