సర్కార్‌పై కుట్రతోనే మణిపూర్ వీడియో లీక్ చేశారు: అమిత్‌షా
పార్లమెంట్ సమావేశాలకు ముందు మణిపూర్ వీడియో విడుదల చేశారని.. దీని వెనుక కుట్ర దాగుందని అమిత్‌షా ఆరోపించారు.
By Srikanth Gundamalla Published on 28 July 2023 10:30 AM ISTసర్కార్‌పై కుట్రతోనే మణిపూర్ వీడియో లీక్ చేశారు: అమిత్‌షా
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చి దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇదే అంశంపై పార్లమెంట్‌లో రచ్చ జరుగుతోంది. సమాధానం ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. దాంతో.. పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు మణిపూర్ వీడియో విడుదల చేశారని.. దీని వెనుక కుట్ర దాగుంది అని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
1990వ దశకం నుంచే మణిపూర్‌లోని కుకీ-మెయిటీ తెగల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. మే 4వ తేదీన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి సంఘటనను వీడియో తీసిన వ్యక్తిని అరెస్ట్ చేసి, మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అమిత్‌షా చెప్పారు. అయితే.. ప్రాథమికంగా చూస్తే ఈ వీడియోను లీక్ చేయడం వెనుక కుట్ర ఉన్నట్లు తెలుస్తోందని అమిత్‌షా అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు దీనిని విడుదల చేసి, తద్వారా మోదీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలనే కుట్ర పన్నినట్లు అర్థం అవుతోందని అన్నారు. మణిపూర్‌లో పరిస్థితులను మరింత తీవ్రతరం చేసేందుకు వీడియోను లీక్ చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు.
మణిపూర్ హింసాత్మక ఘర్షణలకు సంబంధించిన ఏడు కేసుల దర్యాప్తు బాధ్యతను సీబీకి అప్పగించినట్లు కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనకు సంబంధించిన వీడియో కేసు కూడా ఇందులోనే ఉన్నట్లు వివరించింది. మెయిటీలకు ఎస్టీ హోదా కల్పించడంపై పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మణిపూర్ హైకోర్టు ఆదేశించడంతో, కుకీలు మే 3 నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఇరు తెగల మధ్య హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ఘర్షణల్లో వందకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు.