అనాగ‌రికం.. స‌ల‌స‌ల‌కాగే నూనెలో భార్య చేయి పెట్టించాడు.. వీడియో వైర‌ల్‌

'Agnipariksha' Man Puts Wife's Hand In Boiling Oil To Test Her Purity.అచ్చం పురాణాల్లో లాగే చేశాడో భ‌ర్త‌. ఓ మ‌హిళ నాలుగు రోజులు క‌నిపించ‌కుండా పోయింది. అనంత‌రం తిరిగి వ‌చ్చింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Feb 2021 11:34 AM IST
Agnipariksha Man Puts Wife’s Hand In Boiling Oil To Test Her Purity

భార్య‌పై అనుమానం వ‌స్తే ఆమెకు అగ్ని ప‌రీక్ష పెట్టార‌ని.. వాళ్లు అందులోంచి ప‌విత్రంగా బ‌య‌ట‌కు వ‌చ్చారని పురాణం, ఇతిహాసాల‌లో మ‌నం చ‌దువుకున్నాం. వాళ్లు అయితే దేవ‌త‌లు కాబ‌ట్టి వారిని అగ్ని ఏం చేయ‌లేదు. అచ్చం పురాణాల్లో లాగే చేశాడో భ‌ర్త‌. ఓ మ‌హిళ నాలుగు రోజులు క‌నిపించ‌కుండా పోయింది. అనంత‌రం తిరిగి వ‌చ్చింది. ఆమె చెప్పిన దానిని న‌మ్మ‌ని భ‌ర్త‌.. ఆమె చెప్పింది నిజం అని నిరూపించుకోవాల‌ని చెప్పాడు. అందుకోసం స‌ల‌స‌ల కాగే నూనెలో ఐదు రూపాయ‌ల కాయిన్‌ వేశాడు. వాటిని ఆమె చేతితో తీయాలన్నాడు. ఈ క్రూర ఘ‌టన మ‌హారాష్ట్ర‌లోని ఉస్మాన్‌బాద్‌లో వెలుగుచేసింది.

ఫిబ్ర‌వ‌రి 11న భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. దీంతో భార్య ఎవ‌రికి చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లి పోయింది. ఆమె భ‌ర్త కారు డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఆమె కోసం నాలుగు రోజులు తీవ్రంగా వెతికాడు. అయిన‌ప్ప‌టికి ఆమె ఆచూకీ దొర‌క‌లేదు. ఓ రోజు ఆమె ఇంటికి తిరిగి వ‌చ్చింది. గొడవ పెట్టుకుని బయటకు వెళ్లిన రోజున ఉస్మాన్ బాద్‌లో పరాండలో ఖాచపూరి చౌక్ బస్టాప్ దగ్గర బస్ కోసం నిల్చున్నానని.. ఓ ఇద్ద‌రు వ్య‌క్తులు త‌న‌ను బైక్‌పై బ‌ల‌వంతంగా తీసుకెళ్లిన‌ట్లు చెప్పింది. నాలుగు రోజుల పాటు తమ దగ్గరే ఉంచుకున్నారని వాపోయింది. వారి నుంచి ఎలాగోలా త‌ప్పించుకున్నాన‌ని చెప్పింది.


దాంతో తన భార్య చెప్పేది నిజమా కాదా? తెలుసుకునేందుకు అగ్ని పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు. వారి కమ్యూనిటీ సంప్రదాయం ప్రకారం.. కాగే నూనెలో నుంచి వేసిన కాయిన్ తీయాల్సిందిగా చెప్పాడు. అంతేకాదు.. ఈ ఘ‌ట‌న‌ను వీడియో తీశాడు. కాయిన్ తీసే క్ర‌మంలో మ‌హిళ చేతికి గాయం అయిన‌ట్లు ఆ వీడియోలో తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అగ్నిపరీక్ష పేరుతో మహిళలను వేధిస్తూ ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహారాష్ట్ర లెగిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ నీలమ్ గోర్హే రాష్ట్ర హోంశాఖను డిమాండ్ చేశారు.


Next Story