నిరసనల్లో పాల్గొంటే రేప్‌ చేస్తాం.. మాజీ ఎంపీకి సోషల్‌ మీడియాలో వార్నింగ్

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో వైద్యురాలిపై జరిగిన హత్యాచర సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

By Srikanth Gundamalla
Published on : 21 Aug 2024 12:30 PM IST

tmc, former mp mimi Chakraborty, threat, social media, rape warning,

నిరసనల్లో పాల్గొంటే రేప్‌ చేస్తాం.. మాజీ ఎంపీకి సోషల్‌ మీడియాలో వార్నింగ్

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో వైద్యురాలిపై జరిగిన హత్యాచర సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఆమె రేప్‌ కేసు విషయంలో రోజుకో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ కేసును సీబీఐకి అప్పగించారు. సీబీఐ బృందాలు కూడా వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ సంఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. బెంగాల్ ప్రభుత్వాన్ని, పోలీసులను నిలదీసింది. ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు ఆరోజే నమోదు చేయలేదంటూ ప్రశ్నించింది. మరోవైపు ఈ కేసులో న్యాయం అందించాలనీ.. వైద్యులు తమకు భద్రత కల్పించాలంటూ నిరసనలు చేస్తున్నారు. ఈ నిరసనల్లో పలువురు నాయకులు కూడా పాల్గొంటున్నారు.

అలా కోల్‌కతాలో నిర్వహించిన నిరసన ప్రదర్శనల్లో సినీ నటి, మాజీ ఎంపీ మిమీ చక్రబర్తితో పాటు పలువురు పాల్గొన్నారు. నిరసనల్లో భాగమైనందుకు తనకు బెదిరింపులు వచ్చాయని మిమీ చక్రబర్తి చెప్పారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. నిరసన ప్రదర్శనల్లో భాగం అయినందుకు తనను రేప్ చేస్తానని సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయని టీఎంసీ మాజీ ఎంపీ మిమీ చక్రబర్తి చెప్పారు. ఈ బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్‌ షాట్లను ఎక్స్‌లో పెట్టారు.

ఎక్స్‌లో పోస్టు పెట్టిన మిమీ చక్రబర్తి.. ‘మహిళలకు న్యాయం చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం కదా..? విషపూరితమైన పురుషులు.. పైకి మాత్రం మహిళలకు అండగా నిలుస్తున్నామని చెబుతున్నారు. కానీ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు రేప్ చేస్తామని బెదిరిస్తున్నారు. నాకు వచ్చిన బెదిరింపుల్లో ఇవి కొన్ని. ఎలాంటి పెంపకం, చదువు దీన్ని సమ్మతిస్తాయో మరి?’ అని మిమీ చక్రబర్తి ఎక్స్‌లో రాసుకొచ్చారు. నెటిజన్లు మిమీ చక్రబర్తికి మద్దతుగా నిలబడుతున్నారు. కోల్‌కతా పోలీసులు ఆందోళనల్లో పాల్గొంటున్న కాలేజీ విద్యార్థులను అరెస్ట్ చేయడంలో బిజీగా ఉన్నారంటూ కొందరు నెటిజన్స్ కామెంట్ చేశారు.


Next Story