నటి జయప్రద మిస్సింగ్.. వెతుకుతోన్న పోలీసులు
మాజీ ఎంపీ, సినీ నటి జయప్రద కనబడుట లేదని పోలీసులు అంటున్నారు.
By Srikanth Gundamalla Published on 30 Dec 2023 12:12 PM GMTనటి జయప్రద మిస్సింగ్.. వెతుకుతోన్న పోలీసులు
మాజీ ఎంపీ, సినీ నటి జయప్రద కనబడుట లేదని పోలీసులు అంటున్నారు. అయితే.. జయప్రదపై ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిన విషయం తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంగించిన కేసులో యూపీలోని రాంపూర్ కోర్టుకు ఆమెకు నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ ఇచ్చింది. ఇదే కేసులో ఇప్పటికే పలుమార్లు విచారణ కూడా జరిగింది. కానీ ఆమె ఎప్పుడూ కోర్టుకు హాజరుకాలేదు. విచారణకు జయప్రద రావాల్సిందే అని న్యాయమూర్తులు పలుమార్లు చెప్పినా ఆమె పట్టించుకోలేదు. దాంతో సీరియస్‌గా తీసుకున్న న్యాయస్థానం జయప్రదపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
కాగా.. నవంబర్ 8న ఈ కేసులో విచారణ జరిగింది. విచారణకు రావాల్సిన అప్పటికే జడ్జి ఆదేశించినా.. ఆమె కోర్టుకు వెళ్లలేదు. ఈ అంశంపై ప్రాసిక్యూషన్ ఆఫీసర్ అమర్‌నాథ్ తివారీ మాట్లాడుతూ.. నాన్‌బెయిలబుల్ వారెంట్ ఇచ్చినా కోర్టుకు హాజరుకాలేదని చెప్పారు. దాంతో కోర్టు మరోమారు విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది. అప్పుడు కూడా జయప్రద కోర్టులో విచారణకు రాలేదు. ఆపై డిసెంబర్ నెలలో కూడా ఇదే రిపీట్ అయ్యింది. జయప్రద కోర్టుకు హాజరుకాకపోవడాన్ని కోర్టు సీరియస్‌గా తీసుకుంది. జనవరి 10 లోగా జయప్రదను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించింది.
కోర్టు ఆదేశాలతో రామ్‌పూర్ ఎస్పీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. జయప్రదను వెతికే పనిలో పడ్డారు. అయితే.. తాము ఏర్పాటు చేసిన పోలీసు బృందానికి ఇప్పటి వరకు జయప్రద ఆచూకీ తెలియలేదని అన్నారు. ప్రస్తుతం జయప్రద ఎక్కడున్నారో తెలియడం లేదన్నారు పోలీసులు. పోలీసులు అదుపులోకి తీసుకుంటారనే ఉద్దేశంతోనే ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కోర్టు ఆదేశాలు ఉండటంతో.. జయప్రదను ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.
కాగా.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో జయప్రద బీజేపీ తరఫున రాంపూర్ నుంచి పోటీ చేశారు. అక్కడ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆమె ఓ రోడ్డును ప్రారంభించారు. ఈ విషయంపైనే స్వార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. అప్పటి నుంచి ఈ కేసు పెండింగ్‌లోనే ఉంది. తాజాగా కోర్టుకు ఆమె హాజరు అవ్వడంలేదని న్యాయస్థానం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసి.. పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.