యూనిఫాం తీసి చెత్తబుట్టలో వేసి.. రోడ్డుపై పరుగులు పెట్టిన ఎస్సై
Accused SI caught after 1 Km long chase in Karnataka.సాధారణంగా దొంగలను పట్టుకునేందుకు పోలీసులు రోడ్లపై పరుగులు
By తోట వంశీ కుమార్ Published on 5 Nov 2021 11:47 AM ISTసాధారణంగా దొంగలను పట్టుకునేందుకు పోలీసులు రోడ్లపై పరుగులు పెట్టిన ఘటనలు మనం చూశాం. అయితే.. ఇక్కడ ఓ ఎస్సైని పట్టుకునేందుకు ఏసీబీ(అవినీతి నిరోదక శాఖ) అధికారులు రోడ్లపై పరుగులు తీశారు. ఆ ఎస్సై తన యూనిఫాం తీసేసి మరీ రోడ్డుపై పరుగులు పెట్టారు. కిలోమీటరు పాటు వెంటాడి మరీ అధికారులు సదరు ఎస్సైని పట్టుకున్నారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో ని తుముకూరులో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. తుముకూరు గుబ్బిన్ తాలూకాలోని చంద్రశేఖర్ పొరా పోలీసులు.. ఓ కేసు విషయంలో చంద్రన్న అనే వ్యక్తి వాహనాన్ని సీజ్ చేశారు. వాహనాన్ని ఇవ్వాలంటే రూ.28వేలు లంచం డిమాండ్ చేశాడు ఎస్సై సోమశేఖర్. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఎస్సై సోమశేఖర్ ఆదేశాలతో కానిస్టేబుల్ నయాజ్ అహ్మద్ లంచం తీసుకునేందుకు వెళ్లాడు. అప్పటికే అక్కడ కాపు కాసిన ఏసీబీ అధికారులు కానిస్టేబుల్.. రూ.12వేలు నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఎస్సై లంచం తీసుకోమని చెప్పడంతోనే తాను అవినీతికి పాల్పడ్డానని ఏసీబీ అధికారుల విచారణలో కానిస్టేబుల్ చెప్పాడు. కానిస్టేబుల్‌ను తీసుకుని ఏసీబీ అధికారులు పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా.. సమాచారం అందుకున్న సదరు ఎస్సై తాను వేసుకున్న యూనిఫాం చొక్కాను విప్పేసి పక్కనే ఉన్న చెత్త బుట్టలో పడేసి స్టేషన్ బయటకు వచ్చి పరుగు లంకించుకున్నాడు. అప్రమత్తం అయిన ఏసీబీ అధికారులు సదరు ఎస్సై వెంట పరుగులు తీశారు. దాదాపు కిలోమీటరు పాటు అతడిని వెంబడించి.. చివరకు స్థానికుల సాయంతో ఎస్సై సోమశేఖర్ ని పట్టుకున్నారు. అనంతరం కానిస్టేబుల్‌ని, ఎస్సై ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రిమాండ్ విధించింది.