ఓటర్ నమోదుకి ఆధార్ కంపల్సరీ కాదు: ECI
ఓటరు నమోదుకి ఆధార్ కార్డు కంపల్సరీ కాదు అని సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం.
By Srikanth Gundamalla Published on 21 Sept 2023 9:15 PM ISTఓటర్ నమోదుకి ఆధార్ కంపల్సరీ కాదు: ECI
ఓటరు నమోదుకి ఆధార్ కార్డు కంపల్సరీ కాదు అని సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India). ఈ మేరకు ఫారం-6, ఫారం-6Bలో అవసరమైన మార్పులు చేస్తామని ఎన్నికల సంఘం అధికారులు సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే.. ఓ రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా.. సుప్రీంకోర్టుకు ఎన్నికల సంఘం అండర్ టేకింగ్ సమర్పించింది. ఇప్పటికే 66.23 కోట్లాధార్ కార్డులను ఎన్నికల కార్డులతో జత చేశామని సుప్రీంకోర్టుకు తెలిపింది. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోరల్స్ సవరణ రూల్స్-2022 కింద ఆధార్ కార్డు ఓటర్ నమోదుకు తప్పనిసరి కాదని వివరించింది.
ఆధార్ నెంబర్‌ను ఓటర్ ఐడీకి అనుసంధానం చేసేందుకు వీలుగా కేంద్రం 2022 జూన్‌లో ఓటర్ల నమోదు రూల్స్-2022ని నోటిఫై చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రదేశ్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జి.నిరంజన్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఇక ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది సుకుమార్ పట్టజోషి వాదించారు. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం తరఫున అండర్ టేకింగ్‌ను త్రిసభ్య ధర్మాసనానికి సమర్పించారు. అండర్ టేకింగ్‌లో ఫారం-6 (కొత్త ఓటర్ల కోసం దరఖాస్తు ఫారం)తో పాటు ఫారం-6B (రిజిస్ట్రేషన్ ఇన్ ఈ-రోల్) అవసరమైన మార్పులు చేస్తామని తెలిపారు. అంతేకాకుండా ఓటర్ల నమోదు రూల్స్ -2022లోని రూల్ 26-B ప్రకారం ఆధార్ నంబర్‌ను సమర్పించడం తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండర్ టేకింగ్ నేపథ్యంలో రిట్ పిటిషన్‌ను డిస్పోజ్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది.