ఆధార్ ఫ్రీ అప్‌డేషన్ గడువు మరోసారి పొడిగింపు
దేశంలో ఏదైనా పథకం లేదా.. ఇతర సర్టిఫికెట్ల కోసం ఆధార్ కంపల్సరీ అయ్యింది.
By Srikanth Gundamalla Published on 14 Dec 2023 10:14 AM ISTఆధార్ ఫ్రీ అప్‌డేషన్ గడువు మరోసారి పొడిగింపు
దేశంలో ఏదైనా పథకం లేదా.. ఇతర సర్టిఫికెట్ల కోసం ఆధార్ కంపల్సరీ అయ్యింది. ఇదీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఏ ప్రభుత్వ కార్యలయానికి వెళ్లినా ఆధార్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. ఇంత ముఖ్యమైన ఆధార్‌లో కూడా తప్పులు ఉంటాయి. వాటిని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గడువు పొడిగింది. ఉచితంగా ఆధార్‌లో అడ్రస్ సహా ఇతర వివరాలను సొంతంగా అధికారిక ఆన్‌లైన్ వెబ్‌పోర్టల్‌లో అప్‌డేట్ చేసుకుని అవకాశాన్ని పెంచింది.
ఉచితంగా ఆధార్ అప్‌డేషన్ సేవలను మూడు నెలల పాటు పొడిగించారు. ఈ మేరకు ఆధార్‌కార్డులు జారీ చేసే సంస్థ యూఐడీఏఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ కలిగి ఉన్న ఎవరైనా సరే ఆ కార్డు పొందిన పదేళ్ల గడువులో ఒక్కసారి అయినా వారికి సంబంధించిన తాజా అడ్రసు తదితర వివరాలను కచ్చితంగా అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ గతంలో సూచించిన విసయం తెలిసిందే. ప్రభుత్వ పరంగా అన్ని కార్యక్రమాల్లో ఆధార్ వినియోగం పెరగింది. వినియోగదారుడి సమాచారం కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఐడీఏఐ ప్రకటించింది. అదే సమయంలో ఆధార్‌కు సంబందించిన వివిధ రకాల సేవలను పొందాలంటే యూఐఏడీఐ నిర్ధారించిన నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉండగా.. ఆన్‌లైన్‌లో సొంతంగా ఆధార్ అప్‌డేట్ చేసుకునే వారికి ఆ సేవలను మినహాయింపు కూడా ఉంటుందని అప్పట్లో ప్రకటన చేసింది.
ఈ సదుపాయం మొదటగా 2023 ఫిబ్రవరి వరకే ఉంటుందని తెలిపింది. కానీ.. ఆ తర్వాత గడువును మూడు దఫాలుగా పొడిగిస్తూ వచ్చింది. తాజాగా నాలుగోసారి కూడా ఉచితంగా ఆధార్ అప్‌డేషన్ సదుపాయాన్ని పొడిగించింది యూఐడీఏఐ. నాలుగోసారి 2024 మార్చి 14వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ సీఆర్ ప్రభాకరణ్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.