మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియోలో షాకింగ్ విజువల్స్ బయటపడ్డాయి. నాలుగేళ్ల బాలికను వెంబడించి, నేలపైకి పడేశాయి వీధి కుక్కలు. దారినపోయే వ్యక్తి తరిమికొట్టిన తర్వాతే వీధికుక్కలు బాలికను వదిలి పారిపోయాయి. చిన్నారి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైందని తెలుస్తోంది.
రోజుకూలీ కూతురైన బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా, ఆమెపై వీధి కుక్కల దాడి జరిగింది. తప్పించుకునేందుకు ప్రయత్నించిన బాలికను కుక్కలు చుట్టుముట్టి తల, బొడ్డు, కాళ్లపై కొరికాయి. అంతేకాకుండా కుక్కలు బాలికను నేలపైకి పడేశాయి. భోపాల్‌లోని బాగ్ సెవానియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. CCTV కెమెరాల్లో వీడియో రికార్డ్ అయింది. దాడి జరుగుతుండగా అక్కడ ఒక బాటసారి జోక్యం చేసుకుని కుక్కలను తరిమికొట్టాడు.
భోపాల్‌లో వీధి కుక్కల బెడద తీవ్రంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. గతేడాది కోహెఫిజా ప్రాంతంలో ఏడేళ్ల బాలికపై ఆమె తల్లి సమక్షంలోనే వీధికుక్కలు దాడి చేశాయి. 2019లో, ఆరేళ్ల బాలుడిని అతని తల్లి ముందు అర డజను వీధికుక్కలు కొరికాయి. బాలుడిని రక్షించేందుకు ప్రయత్నించిన తల్లికి తీవ్ర గాయాలయ్యాయి.