దేశంలోనే తొలి త్రీడీ పోస్ట్ ఆఫీస్.. ఎక్కడో తెలుసా?
భారత్‌లోనే తొలి త్రీడీ పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్‌ను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు.
By Srikanth Gundamalla Published on 18 Aug 2023 2:18 PM ISTదేశంలోనే తొలి త్రీడీ పోస్ట్ ఆఫీస్.. ఎక్కడో తెలుసా?
భారత్‌లోనే తొలి త్రీడీ పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్‌ను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు. త్రీడీ ప్రింటింగ్ సాయంతో బెంగళూరులో ప్రింట్ చేసిన ఈ బిల్డింగ్‌ను ఆగస్టు 18న కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఈ బిల్డింగ్‌ను 45 రోజుల్లో పూర్తి చేశారని అశ్విని వైష్ణవ్ తెలిపారు. అయితే.. నిర్మాణ పనులకు సంబంధించిన వీడియోను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. బెంగళూరులోని హాలాసూర్ కేంబ్రిడ్జి లే అవుట్‌లో ఈ బిల్డింగ్‌ను దాదాపు వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపొందించారు. ఈ పోస్టాఫీస్ కు “కేంబ్రిడ్జ్ లేఅవుట్ పోస్ట్” అని పేరు పెట్టారు.
ఎల్ అండ్ టీ కంపెనీ త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఈ నిర్మాణాన్ని పూర్తి చేసింది. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగళూరులోని కేంబ్రిడ్జ్ లేఅవుట్‌లో భారతదేశపు మొట్టమొదటి త్రీడీ ప్రింటెడ్ పోస్ట్ ఆఫీసును చూసి ప్రతి భారతీయుడు గర్వపడతాడని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఇది పురోగతికి నిదర్శనమని, దేశ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని అన్నారు. త్రీడీ పోస్ట్ ఆఫీసు పూర్తి అయ్యేలా కృషి చేసిన ప్రతిఒక్కరకీ ఈ సందర్భంగా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కృతజ్ఞతలు తెలిపారు. బెంగళూరు త్రీడీ పోస్ట్ ఆఫీస్ నిర్మించడంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణలోనూ త్రీడీ ప్రింటెడ్ నిర్మాణం జరగబోతుంది. ప్రపంచంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ దేవాలయం సిద్ధిపేట జిల్లాలోని చర్విత మెడోస్‌లో నిర్మితం కానుంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అప్పుజా ఇన్‌ఫ్రా టెక్, సంప్లిఫోర్జ్ క్రియేషన్స్ సంస్థలు ఈ ఆలయాన్ని నిర్మించనున్నాయి. త్రీడీ ప్రింటెడ్ ఆలయాన్ని 3,800 చదరపు అడుగుల వైశాల్య, 30 అడుగుల ఎత్తులో మూడు భాగాలుగా ఉండనుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన మెటీరియల్, సాఫ్ట్‌వేర్‌తో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణం పూర్తయ్యాక సందర్శకులు పెద్ద ఎత్తు వస్తారని అధికారులు భావిస్తున్నారు.
The spirit of Aatmanirbhar Bharat!🇮🇳India’s first 3D printed Post Office.📍Cambridge Layout, Bengaluru pic.twitter.com/57FQFQZZ1b
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 18, 2023