చెత్త ఏరుకునే వ్యక్తికి డంపింగ్‌ యార్డ్‌లో దొరికిన రూ.25 కోట్లు

బెంగళూరులో చెత్త ఏరుకునే వ్యక్తి రూ.25 కోట్ల విలువైన కరెన్సీ దొరికింది.

By Srikanth Gundamalla  Published on  10 Nov 2023 10:11 AM IST
25 crore currency, found,  garbage collector,

చెత్త ఏరుకునే వ్యక్తికి డంపింగ్‌ యార్డ్‌లో దొరికిన రూ.25 కోట్లు

మనం రోడ్డుపైన నడుస్తూ వెళ్తున్న సమయంలో అప్పుడప్పుడు డబ్బులు దొరుకుతాయి. యాభై.. వంద.. ఐదు వందల వరకు ఇలా లభిస్తుంటాయి. అయితే.. అవి పడేసుకున్న వారు మనకు కనిపిస్తే వెంటనే తిరిగిస్తాం.. కానీ.. అక్కడ ఎవరూ లేకపోతే మాత్రం వాటిని జేబులో వేసుకుని సైలెంట్‌గా వెళ్లిపోతాం కదా. కానీ.. తక్కువ మొత్తంలో దొరికితేనే చాలా సంతోషపడిపోతాం.. ఇక దొరికిన డబ్బు కోట్లలో ఉంటే. ఊహించడానికే చాలా బాగా అనిపిస్తుంది కదా. చాలా మంది అనుకుంటుంటారు కూడా ఇలాగే. ఒకేసారి రెండుమూడు కోట్ల రూపాయలు దొరికితే బాగుండూ అని. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది ఓ వ్యక్తికి.

బెంగళూరుకు చెందిన సల్మాన్‌ షేక్‌ అనే వ్యక్తి చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పనిలో భాగంగానే నవంబర్‌ 1న కూడా చెత్త ఏరుకోవడం మొదలు పెట్టాడు. బెంగళూరు శివారులో చెత్త ఏరుకుంటుండగా అతనికి అమెరికన్ డాలర్ల కట్టలు కనబడ్డాయి. వాటిని చూసిన ఆ వ్యక్తి షాక్‌ అయ్యాడు. వెంటనే ఆ కరెన్సీ మొత్తాన్ని తీసుకుని సంచిలో వేసుకున్నాడు. ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత వాటిని ఏం చేయాలో తెలియని ఆ వ్యక్తి.. నవంబర్‌ 5న మొత్తాన్ని తన యజమానికి అందించాడు. చెత్త ఏరుకునే వ్యక్తికి మొత్తం 23 కట్టల అమెరికా కరెన్సీ దొరికింది. దాని విలువ మొత్తం రూ.25 కోట్లు ఉంటుంది.

సదురు యజమాని ఇదే విషయాన్ని స్థానిక సామాజిక కార్యకర్త కలిముల్లాహ్‌కి తెలిపాడు. ఇద్దరూ కలిసి ఆ కరెన్సీని బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ దయానందకు అందించారు. పట్టుబడ్డ అమెరికా డాలర్స్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. ఆ తర్వాత ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని పోలీసులకు ఆదేశించారు. మొత్తం పట్టుబడ్డ కరెన్సీ విలువ రూ.25 కోట్లు ఉంటుందని పోలీసులు కూడా అంచనా వేశారు. అయితే.. పట్టుబడ్డ అమెరికన్ డాలర్లపై కొన్ని రకాల రసాయనాలను పూసినట్లు పోలీసులు గుర్తించారు. బ్లాక్‌ డాలర్‌ స్కామ్‌కు పాల్పడుతున్న ముఠాకు చెందినవారు ఈ కరెన్సీని చెత్త కుప్పల్లో వదిలేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అంతేకాక.. దొరికిన కరెన్సీ నిజమైన డాలర్లా? లేదంటే నకిలీవా? అని కూడా దర్యాప్త చేస్తున్నారు పోలీసులు. అయితే.. పట్టుబడ్డ కరెన్సీని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాకు పంపామని వెల్లడించారు.

Next Story