ఢిల్లీలో ఉగ్రకుట్ర భగ్నం.. ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదులు అరెస్టు
2 Jaish-e-Mohamed terrorists arrested in delhi .. ఉగ్రవాదులు ఎక్కడో ఓ చోటు కుట్ర చేసేందుకు ప్లాన్ వేస్తున్నా.. పోలీసులు
By సుభాష్ Published on 17 Nov 2020 3:03 PM ISTఉగ్రవాదులు ఎక్కడో ఓ చోటు కుట్ర చేసేందుకు ప్లాన్ వేస్తున్నా.. పోలీసులు వారి కుట్రను భగ్నం చేస్తూ వస్తున్నారు. ఇక ఢిల్లీలో అయితే ఏదో ఒక చోట పేలుళ్లు సృష్టించేందుకు ఎన్నో రోజుల నుంచి ప్లాన్ వేస్తున్నా.. అది సాధ్యం కావడం లేదు. నిఘా వర్గాల సమాచారంతో పట్టుబడుతున్నారు. తాజాగా ఢిల్లీ నగరంలో భారీ ఉగ్రదాడులకు పాల్పడేందుకు వేసిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీలోని సరయ్ కాలేఖాన్ ప్రాంతంలో ఇద్దరు జైషే మహ్మద్ తీవ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి తుపాకులు, మరణాలయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం రావడంతో అప్రమత్తమైన పోలీసు ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టింది. సోమవారం రాత్రి పక్కా ప్రణాళిక చేపట్టి సరయ్ కాలేఖాన్ ప్రాంతంలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన వారుగా గుర్తించారు. వీరు జమ్మూకశ్మీర్‌కు చెందిన అబ్దుల్ లతీఫ్‌మీర్, అష్రఫ్ ఖటానాగా గుర్తించారు.
అయితే జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు పని చేస్తున్న వీరు గతంలో పీఓకేకు వెళ్లేందుకు ప్రయత్నించగా, భారత ఆర్మీ వీరిని అడ్డుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఢిల్లీలో ఉగ్ర దాడులు జరిపి ఆ తర్వాత నేపాల్ మీదుగా పీఓకే వెళ్లాలని వీరు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరి కుట్రలను భగ్నం చేసి వారిని అరెస్టు చేశారు. ప్రస్తుతం వారిని లోతుగా విచారిస్తున్నారు. కాగా, ఆగస్టులో కూడా వీరు ఇలాంటి కుట్ర చేసేందుకు ప్లాన్ చేయగా, పోలీసులు భగ్నం చేశారు. తాజాగా మరోసారి కుట్రకు ప్లాన్ వేయడం సంచలనం రేపుతోంది.