పోలీసు కస్టడీలో 1,888 మరణించగా.. 26 మంది పోలీసులు మాత్రమే దోషులుగా

1888 Deaths in police custody in last 20 years.ఉత్తరప్రదేశ్‌లో అల్తాఫ్‌ అనే యువకుడు చనిపోవడంతో.. పోలీసు కస్టడీలో

By M.S.R  Published on  16 Nov 2021 12:30 PM GMT
పోలీసు కస్టడీలో 1,888 మరణించగా.. 26 మంది పోలీసులు మాత్రమే దోషులుగా

ఉత్తరప్రదేశ్‌లో అల్తాఫ్‌ అనే యువకుడు చనిపోవడంతో.. పోలీసు కస్టడీలో మరణాలపై మరోసారి పెద్ద చర్చకు దారితీసింది. గత 20 ఏళ్లలో దేశవ్యాప్తంగా 1,888 మంది పోలీసు కస్టడీలో మరణించారు. 26 మంది పోలీసులు మాత్రమే దోషులుగా తేలింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం, దేశవ్యాప్తంగా గత 20 ఏళ్ల డేటాను పరిశీలిస్తే కస్టడీలో ఉన్న పోలీసులపై 893 కేసులు నమోదయ్యాయి. 358 మందిపై ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. కానీ ఈ కేసుల్లో కేవలం 26 మంది పోలీసులే దోషులుగా తేలింది.

ఎన్‌సిఆర్‌బి డేటా అధ్యయనం ప్రకారం 2006లో కస్టడీ మరణాల్లో అత్యధికంగా 11 మంది పోలీసులు దోషులుగా తేలింది. యూపీలో ఏడుగురు, మధ్యప్రదేశ్‌లో నలుగురు పోలీసులను దోషులుగా నిర్ధారించారు. గతేడాది 2020లో 76 మంది కస్టడీలో మరణించారు. గుజరాత్‌లో అత్యధికంగా 15 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ మరియు పశ్చిమ బెంగాల్‌లలో కూడా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. అయితే గతేడాది ఎవరికీ శిక్ష పడలేదు. ఎన్‌సిఆర్‌బి 2017 నుండి కస్టడీ మరణాల కేసులలో పోలీసులను అరెస్టు చేసిన డేటాను విడుదల చేసింది. గత నాలుగేళ్లలో కస్టడీ మరణాలకు సంబంధించి 96 మంది పోలీసులను అరెస్టు చేశారు. అయితే, ఇందులో గత సంవత్సరం డేటా లేదు. 2001 నుండి బ్యూరో డేటా ప్రకారం "నాట్ ఆన్ రిమాండ్" కేటగిరీలో 1,185 మరణాలు మరియు 703 మరణాలు "ఇన్ రిమాండ్" కేటగిరీలో నమోదయ్యాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పోలీసు కస్టడీలో మరణాలపై చర్చ కొనసాగుతోంది.

అల్తాఫ్ మరణం:

రాష్ట్ర రాజధాని లక్నోకు పశ్చిమాన 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని ఎటాహ్ జిల్లాలో 22 ఏళ్ల వ్యక్తి అల్తాఫ్ కొద్దిరోజుల కిందట పోలీసు స్టేషన్‌లో మరణించాడు. అయితే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఉన్నతాధికారులు ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. మహిళను కిడ్నాప్ చేసి బలవంతంగా వివాహం చేసుకున్నందుకు దాఖలు చేసిన కేసులో విచారణ కోసం అల్తాఫ్ ను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఎటా పోలీస్ చీఫ్ రోహన్ ప్రమోద్ బోత్రే తో అల్తాఫ్ పోలీస్ స్టేషన్‌లో మరుగుదొడ్డికి వెళ్లాలని అడిగాడు. కొన్ని నిమిషాల తర్వాత కూడా అతడు తిరిగి రాకపోవడంతో పోలీసులు లోపలికి వెళ్లి చూడగా అతడి నుండి రక్తం కారుతూ ఉండడాన్ని గమనించారు. గొంతు కోసుకోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అతను అపస్మారక స్థితిలో ఉండగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ కేసులో సస్పెండ్ అయిన ఐదుగురు పోలీసులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ప్రవర్తించారని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Next Story