Independence day 2023 : 1857 సిపాయి తిరుగుబాటు.. స్వాతంత్య్ర పోరాటానికి ఊపిరి.!
1857 సిపాయి తిరుగుబాటు.. ఇది మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం అని కూడా అంటారు. ఈ యుద్ధమే స్వాతంత్ర్య పోరాటానికి ఊపిరిలూదింది.
By అంజి Published on 8 Aug 2023 11:15 AM IST
Independence day 2023 : 1857 సిపాయి తిరుగుబాటు.. స్వాతంత్ర్య పోరాటానికి ఊపిరి.!
1857 సిపాయి తిరుగుబాటు.. ఇది మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం అని కూడా అంటారు. ఈ యుద్ధమే స్వాతంత్ర్య పోరాటానికి ఊపిరిలూదింది. స్వాతంత్ర్య కాంక్షను రగిల్చింది. అయితే ఉత్తర, మధ్య భారతదేశంలో బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన ఈ తిరుగుబాటు, వైఫల్యంతో ముగిసింది. 1857 మే 10 న మీరట్‌లో సిపాయిలతో మొదలైన తిరుగుబాటు, ఉత్తర గంగా మైదానంలోను, మధ్య భారతంలోనూ పౌర తిరుగుబాటుగా పరిణమించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ దశాబ్దాల అరాచక పాలనను తొలిసారిగా వ్యతిరేకించిన పోరాటం ఇది. భారతీయులు తిరగబడితే ఎలా ఉంటుందో రుచి చూపించిన ఘటన ఇది. ఈ తిరుగబాటుతో బ్రిటీషర్లకు చెమటలు పట్టేలా చేశారు. మరీ ఈ తిరుగుబాటు ఎందుకు వైఫల్యమైంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
1857 తిరుగుబాటుకు.. సిపాయ్ మ్యూటినీ, ఇండియన్ మ్యూటినీ, రివోల్ట్ ఆఫ్ 1857, గ్రేట్ రెబీలియన్, స్వాతంత్ర్య తొలి యుద్ధం వంటి పేర్లు ఉన్నాయి. భారత్‌ని పాలిస్తున్న సమయంలో బ్రిటీష్ సైన్యంలో 87 శాతం మంది భారతీయులే ఉండేవారు. ఇక బ్రిటీషర్లతో పోల్చుకుంటే.. భారతీయుల జీతం చాలా తక్కువ. సేమ్ ర్యాంక్‌లో ఉన్నా.. జీతం మాత్రం తక్కువగా ఉండేది. దీనిపై భారత సైనికుల్లో చాలా అసంతృప్తి ఉండేది. ఇంటికి చాలా దూరంలో ఉంటూ పని చేయాల్సి వచ్చేది. 1856లో భారత సైనికులు బ్రిటీష్ ప్రయోజనాల కోసం సముద్రాలు కూడా పని చేయాల్సి ఉంటుందని లార్డ్ కన్నింగ్ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు జనరల్ సర్వీసెస్ ఎన్‌లైట్‌మెంట్ యాక్ట్‌ను ప్రవేశపెట్టారు. అదే సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రజలపై భారీ మొత్తంలో పన్నులు విధించడం మొదలుపెట్టింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతులు, వ్యవసాయ కూలీల పరిస్థితి చాలా దీనంగా ఉండేది. అప్పులు, పన్నులు కట్టలేకపోయేవారు. బ్రిటీష్ సైన్యంలో ఉన్న అనేకమంది భారతీయులు.. వ్యవసాయ కులీల కుటుంబం నుంచి వచ్చిన వారే. తమ వారు పడుతున్న బాధలను చూసి కన్నీరుపెట్టుకునే వారు.
తిరుగుబాటుకు ట్రిగ్గర్ పాయింట్ ఇదే
1857లో భారత సైనికులకు ఎన్‌ఫీల్డ్ రైఫిల్స్‌ని అందించింది బ్రిటీష్. అయితే సమస్యంతా వచ్చింది ఆ రైఫిల్స్‌లో నింపే తూటాలతోనే. క్యాట్రిజ్ పేపర్‌ని నోటితో చింపి రైఫిల్స్‌లో తూటాలు ఫిల్ చేయాల్సి ఉంటుంది. కానీ వాటికి ఆవు, పంది కొవ్వుతో తయారు చేస్తారని అప్పట్లో ఊహాగానాలు ఉండేవి. ఆవు హిందువులకు అత్యంత పవిత్రమైన జంతువు. వాటిని వాడటానికి వారు నిరాకరించారు. వీరికి ముస్లిం సోదరులు కూడా మద్దతినివ్వడంతో సిపాయి తిరుగుబాటు మొదలైంది. 1857తో మార్చి నెలలో బారక్‌పోరాకు చెందిన మంగళ్ పాండే అనే సైనికుడు.. క్యాట్రిజ్‌ని నోట్లో పెట్టుకునేందుకు నిరాకరించాడు. బలవంతం చేసిన అధికారులపై తిరుగుబావుటా ఎగరేశాడు. దీంతో ఏప్రిల్ 8న మంగళ్ పాండేను ఉరితీశారు. ఇది జరిగిన 30 రోజులకు మీరట్‌కు చెందిన మరో 85 మంది సైనికులు కొత్త రైఫిల్స్‌ను వాడేందుకు నిరాకరించారు. వారికి ఈస్ట్ ఇండియా కంపెనీ 10ఏళ్ల కఠిన జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత ఆ ప్రాంతం జవాన్లు బ్రిటీష్ పాలకులపై పూర్తిగా తిరగబడ్డారు.
అలా 1857 మే 10 న మీరట్‌లో సిపాయిలతో మొదలైన తిరుగుబాటు, ఉత్తర గంగా మైదానంలోను, మధ్య భారతంలోనూ ప్రజా తిరుగుబాటుగా పరిణమించింది. కాన్పూర్, లక్నో, బరేలీ, ఝాన్సీ, గ్వాలియర్, పట్నా, రాజస్థాన్ సరిహద్దు వరకు ఈ 1857 తిరుగుబాటు విస్తరించింది. ఝాన్సీ లక్ష్మీ భాయ్ తిరుగుబాటుకు మద్దతునిస్తూ వచ్చింది. పలువురు రాజులు సైతం బ్రిటీషర్లపై పోరాటంలో పాల్గొన్నారు. తూర్పు భారత్‌లో కూడా తిరుగుబాటు ఘటనలు జరిగాయి. ఈ తిరుగుబాటు ఆ ప్రాంతాల్లో బ్రిటీషు అధికారాన్ని సవాలు చేసింది. 1858 జూన్ 20 న తిరుగుబాటుదార్లను ఓడించడంతో ఇది ముగిసింది. ఆ తర్వాత తిరుగుబాటులో పాల్గొన్న వారందరికీ బ్రిటిషు ప్రభుత్వం 1858 నవంబరు 1 న క్షమాభిక్ష మంజూరు చేసింది. 1859 జూలై 8 న యుద్ధం ముగిసినట్లు ప్రకటించినది. అయితే ఈ సిపాయి తిరిగుబాటు అనుకున్నది సాధించలేకపోయినప్పటికీ.. దేశ స్వాతంత్ర్య కాంక్షను రగిల్చిన తొలి పోరాటంగా చరిత్రలో నిలిచిపోయింది. బానిస సంకెళ్లతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న ప్రజలు.. స్వతంత్ర భారత దేశం కోసం కలలు కనే ధైర్యాన్ని ఇచ్చింది.