ఫేక్ NCC క్యాంప్‌లో 13 మంది బాలికలపై లైంగిక వేధింపులు, 11 మంది అరెస్ట్
తమిళనాడులోని కృష్ణగిరిలో నకిలీ ఎన్‌సిసి శిబిరంలో 13 మంది బాలికలు లైంగిక వేధింపులకు గురయ్యారు.
By Srikanth Gundamalla Published on 19 Aug 2024 6:05 AM GMTNCC శిబిరంలో 13 మంది బాలికలపై లైంగిక వేధింపులు, 11 మంది అరెస్ట్
తమిళనాడులోని కృష్ణగిరిలో నకిలీ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సిసి) శిబిరంలో 13 మంది బాలికలు లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ కేసులో క్యాంపు నిర్వాహకుడు, పాఠశాల ప్రిన్సిపాల్, ఇద్దరు ఉపాధ్యాయులు, కరస్పాండెంట్‌తో సహా 11 మందిని అరెస్టు చేశారు పోలీసులు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
కృష్ణగిరిలో ఈ నెల ప్రారంభంలో జరిగిన మూడు రోజుల ఎన్‌సీసీ శిబిరంలో 17 మంది బాలికలతో పాటు మరో 41 మంది బాలురు పాల్గొన్నారు. బాలికలకు మొదటి అంతస్తులోని పాఠశాల ఆడిటోరియంలో, బాలురకు గ్రౌండ్ ఫ్లోర్‌లో వసతి కల్పించారు. శిబిరాన్ని పర్యవేక్షించేందుకు ఉపాధ్యాయులను నియమించలేదు. తమను ఆడిటోరియం నుంచి బయటకు రప్పించి లైంగికంగా వేధించారని బాలికలు ఆరోపించారు.
"లైంగిక నేరాల గురించి పాఠశాల అధికారులకు తెలుసు. అయితే పోలీసులకు సమాచారం ఇవ్వడానికి బదులు విషయాన్ని అణిచివేయాలనరి చూశారు. విద్యార్థులు దానిని సీరియస్‌గా తీసుకోవద్దని సూచించారని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పి తంగదురై తెలిపారు. మరోవైపు ప్రైవేట్ పాఠశాలలో ఎన్‌సిసి యూనిట్ లేదని పరిశోధనలో తేలిందని పోలీసులు తెలిపారు. ఇలాంటి క్యాంపును నిర్వహించడం వల్ల ఎన్‌సిసి యూనిట్‌కు అర్హత సాధిస్తామని నిర్వాహకులు పాఠశాల యాజమాన్యానికి చెప్పారని పోలీసులు తెలిపారు. ఇక నకిలీ ఎన్‌సిసి క్యాంపు వెనుక ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారు. ఇతర పాఠశాలల్లో ఇలాంటి క్యాంపులు నిర్వహించిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.