మార్స్ పై మీ పేరు పంపడానికి ఇంకా 2 రోజులే...!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Sep 2019 12:10 PM GMT
మార్స్ పై మీ పేరు పంపడానికి ఇంకా 2 రోజులే...!

భూమి తర్వాత మనుషులు బతికే అవకాశం ఉన్న గ్రహంగా మార్స్ ని చెబుతున్న నాసా, దాన్ని చేరుకునే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా, ఇప్పటికే డజన్ల కొద్దీ శాటిలైట్లు, రోవర్లను అక్కడకు పంపింది.

తాజాగా, మరో రోవర్‌ను జులై 17, 2020లో భూమిపై నుంచీ మార్స్‌కి పంపబోతోంది. ఆ రోవర్ ద్వారా, భూమిపై ఉన్న మనుషుల పేర్లను మార్స్‌కి పంపబోతోంది నాసా. ఇందుకు మనల్ని పేర్లు ఎంటర్ చేసుకోమని కోరుతోంది. మీకు కూడా ఆసక్తి ఉంటే, మీ పేరును మార్స్‌పైకి పంపాలనుకుంటే... పంపొచ్చు. అందుకు సెప్టెంబర్ 30 వరకే టైమ్ ఉంది. ఆలోగా పంపాల్సి ఉంటుంది. అదేమీ కష్టమైన పని కాదు. నిమిషం కూడా పట్టదు.

మన పేర్లు పంపిన తరువాత, వాటిని నాసా వారు సమీక్షించి అమోద ముద్ర వేసాక ఒక చిన్న సిలికాన్ చిప్ లో ఆ పేరును నమోదు చేస్తారు. ఇప్పటికే 9.1 మిలియన్ మంది ఔత్సాహికులు తమ పేర్లను నాసాకు పంపించి బోర్డింగ్ పాస్‌లు తీసుకున్నారు. వెయ్యి కిలోల బరువుండే మార్స్ రోవర్, అంగారకుడిపై గతంలో ఉన్న సూక్ష్మజీవుల మనుగడపై పరిశోధనలు చేయనుంది. అక్కడి వాతావరణం, గ్రహతల పరిస్థితులు తదితర విషయాలను తెలుసుకోనుంది.

మీకు కూడా ఈ మిషన్‌లో భాగస్వాములు కావాలంటే మీ పేర్లను వెంటనే go.nasa.gov/2Lq3vyE లింక్ ద్వారా నాసాకు పంపించండి. అందులో మీ పేరు, చిరునామా నమోదు చేసిన వెంటనే బోర్డింగ్ పాస్ సిద్ధమైపోతుంది.



Next Story