తన చిన్నప్పుడు సాలార్జంగ్ మ్యూజియంను చూడడానికి వచ్చినప్పుడు.. అక్కడ ఉండే పెయింటింగ్స్ ను చూసి నరసింహ గౌడ్ అబ్బుర చెందేవాడు. ఇప్పుడు అతడు తన పెయింటింగ్స్ ను అదే మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచాడు.

భారతదేశం లోని 29 రాష్ట్రాలకు సంబంధించిన సంస్కృతీ సంప్రదాయాలను పెద్ద పెద్ద సెలెబ్రిటీలు పాటిస్తే ఎలా ఉంటారా అన్నది నరసింహ గౌడ్ పెయింటింగ్స్ లోని ప్రత్యేకత. ఉదాహరణకు బారక్ ఒబామా, ఆయన భార్య మిషెల్లీ ఒబామా.. వారి పిల్లలు ఇక్కడి సంస్కృతికి అలవాటు పడితే వారి ఆహార్యం ఎలా ఉంటుందన్నది నరసింహ గౌడ్ పెయింటింగ్స్ లో కనపడుతుంది.

ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని భిన్న సంప్రదాయాలు ఒక్క భారతదేశంలో మాత్రమే ఉన్నాయని.. భాషలు, తిండి, వేషధారణలు.. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయని నరసింహ గౌడ్ చెప్పుకొచ్చాడు. అదే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన నాయకులు మన ఆచారవ్యవహారాలను పాటిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన తనకు వచ్చిందని అలా చేస్తే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కూడా వస్తుందని భావించానన్నాడు నరసింహ. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు, ప్రజల వేషధారణలో ప్రపంచప్రఖ్యాతి గాంచిన వ్యక్తులను ఊహించుకుని తన పెయింటింగ్స్ ను వేశాడు. 2014 నుండి పలు ప్రాంతాలలో పర్యటించాడు నరసింహ. ఉత్తర భారతదేశంలోని మారుమూల ప్రాంతాల మినహా అన్ని చోట్లకు వెళ్ళాడు నరసింహ.. అక్కడకు కూడా వెళ్లే వాడినే కానీ.. భాష, డబ్బుల విషయంలో ఇబ్బందులు ఎదురవ్వడంతో అక్కడికి వెళ్ళలేకపోయానని చెప్పాడు. దీంతో ఆన్ లైన్ లో కూడా చాలానే రీసర్చ్ చేశానని తెలిపాడు.

తన పెయింటింగ్స్ గురించి కూడా నరసింహ వివరించాడు. ఒబామా పెయింటింగ్ లో ఉన్నది గొంగడి రగ్గు అని దానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పుకొచ్చాడు.. తెలంగాణలో గొంగడి రగ్గులు తయారీ చేసే వారి దగ్గరకు వెళ్లి వచ్చానని.. అవి చలికాలంలో మనిషి శరీరానికి కావాల్సిన వేడిని అందిస్తాయని.. వేసవి కాలంలో వాటిని కప్పుకుంటే ఉక్కపోయదని ఎంతో గొప్పగా వివరించాడు. అలాగే ఆ కంబళి మీదున్న ఎరుపు రంగు ఆ వ్యక్తి ధనిక కుటుంబానికి చెందినవాడనే విషయాన్ని.. తెలుగు రంగు పేదరికాన్ని గుర్తు చేస్తుందని అన్నాడు. అలాగే మిషెల్లీ ఒబామాను లంబాడీ మహిళగా తన పెయింటింగ్స్ లో చూపించాడు. ఆమె మేడలో ఉన్న హారం ఆమె ధనవంతురాలనే విషయాన్ని తెలియజేస్తుందని తెలిపాడు. అలాగే ఒబామా కుమార్తెలను గుజరాతి, రాజస్థానీ వస్త్రాలలో చూపించాడు.

ఇప్పటికే 11 పెయింటింగ్ లను పూర్తీ చేసిన నరసింహ.. మరో నాలుగు పెయింటింగ్ లను పూర్తీ చేయబోతున్నాడు. ఇతరదేశాల నుండి తీసుకొచ్చిన ఆయిల్ పెయింట్స్ ద్వారా తన కళకు మెరుగులు దిద్దుతున్నాడు. తాను రూపొందించే పెయింటింగ్స్ దాదాపు 1000 సంవత్సరాల వరకూ చెక్కుచెదరవని అంటున్నాడు. అంతర్జాతీయ వేదికలపై తన పెయింటింగ్స్ ను ప్రదర్శించాలని తాను అనుకుంటున్నానని.. అందుకు ఆయిల్ పెయింటింగ్స్ సరిపోతాయని చెప్పుకొచ్చాడు. వచ్చే సంవత్సరం అమెరికాలో తన పెయింటింగ్స్ ను ప్రదర్శనకు ఉంచాలని భావిస్తున్నాడు నరసింహ. అమెరికా మాజీ అధ్యక్షుడు, ఆయన కుటుంబాన్ని ఆహ్వానించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. అతడి పెయింటింగ్స్ లో ఐశ్వర్య రాయ్ కూడా భాగమే కావడంతో త్వరలో ముంబైలో కూడా తన పెయింట్స్ ను ప్రదర్శనకు ఉంచాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.