11 సంవత్సరాల వయసులో పెళ్లి.. ముగ్గురు పిల్లలు.. ఇప్పుడు నారీ శక్తి అవార్డు..!

By సుభాష్  Published on  8 March 2020 3:53 PM GMT
11 సంవత్సరాల వయసులో పెళ్లి.. ముగ్గురు పిల్లలు.. ఇప్పుడు నారీ శక్తి అవార్డు..!

భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళానికి చెందిన పడాల భూదేవి నారీ శక్తి అవార్డును అందుకుంది. గ్రామీణ మహిళా రైతుల అభ్యున్నతి కోసం భూదేవి ఎన్నో ఏళ్లుగా పాటుపడుతోంది. గిరిజన మహిళలకు అన్ని విధాలా అండగా నిలుస్తూ ఉంది పడాల భూదేవి. ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ అవార్డుతో సత్కరించింది.

భూదేవి ఎంతో మంది మహిళా రైతులను ఆదుకోవడంలో సఫలమైంది. వారిని సరైన దారిలో నడిపిస్తూ ఉన్న భూదేవి మన్యం గ్రైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ మన్యదీపిక ఫార్మర్స్ కంపెనీ లిమిటెడ్ కు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆమె 'చిన్నయ్య ఆదివాసీ వికాస్ సొసైటీ' అనే ఆర్గనైజేషన్ ద్వారా గిరిజన మహిళలకు, వితంతువులకు అండగా నిలుస్తోంది. ఈ సంస్థను 1996లో భూదేవి తండ్రి ఏర్పాటు చేసారు. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఐ.టి.డి.ఏ.) సౌజన్యంతో గిరిజన ప్రాంతాల్లోని బాలింతల్లోనూ, చంటి పిల్లల్లోనూ పౌష్ఠికాహార లోపం లేకుండా చూసుకుంటున్నారు.

భూదేవి చిన్న వయసులోనే ఎన్నో సమస్యలను ఎదుర్కొని నిలబడింది. 11 సంవత్సరాల వయసులోనే ఆమెకు పెళ్లి చేశారు కుటుంబ సభ్యులు. భర్త, అత్త, కుటుంబ సభ్యులు ఆమెను చిత్ర హింసలకు గురిచేశారు. ఆ తర్వాత వారి నుండి బయటకు వచ్చేసిన భూదేవి తన ముగ్గురు కూతుళ్లను సొంతంగా పెంచుకుంటూ వచ్చింది. చుట్టుపక్కల ఉన్న మహిళలలో చైతన్యాన్ని నింపింది. వ్యవసాయం చేస్తున్న మహిళలకు మరిన్ని మెళుకువలు నేర్పించింది. ఆడది అన్ని విషయాల్లోనూ ఎదగాలని సూచించింది. తన సంస్థ సహాయంతో ఎందరినో చేరదీసింది.

భూదేవి అన్న పేరు ఆమెను సార్థకం చేసింది. ఎందుకంటే ఆమెలో ఉన్న ఓర్పు సహనం అలాంటిది. ఆమె తండ్రి పేరు చిన్నయ్య. సీతంపేటకు చెందిన వ్యక్తి. వాళ్ళ ఊరు అలా ఏజెన్సీ ప్రాంతం లోకి రాదు.. అలాగని మైదాన ప్రాంతం లోకి కూడా వచ్చేది కాదు. అప్పట్లో వారి భూములకు సంబంధించిన పేపర్లు కూడా వారి దగ్గర ఉండేటివి కావు.. అలా ఉన్నవాటిని అన్యాక్రాంతం చేసుకోడానికి ప్రయత్నించేవాళ్ళు ఎంతో మంది.. అధికార బలంతో రైతులను చాలా ఇబ్బందులు పెట్టేవారు. అలాంటివాళ్ళందరికీ అండగా నిలవడానికి 1996లో 'ఆదివాసీ వికాస్ ట్రస్ట్' ను ఏర్పాటు చేశారు. రైతులకు అధికారులకు మధ్య నిలిచి ఎంతో మందికి పట్టాలు ఇప్పించారు. ఇదే సమయంలో భూదేవికి 11 సంవత్సరాల వయసులోనే పెళ్లి జరిగిపోయింది. భూదేవికి ముగ్గురూ ఆడపిల్లలే పుట్టడంతో ఆమె భర్త ఆమెను పట్టించుకోవడం మానేశాడు.

అత్తారింటిలో ఎన్నో కష్టాలకు ఓర్చుకున్నాక 2000 సంవత్సరంలో తన పుట్టినింటికి చేరుకుంది. రోజుకూలీకి వెళుతూనే తన తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచేది. తన తండ్రి స్థాపించిన ట్రస్ట్ లో గవర్నింగ్ మెంబర్ అయ్యింది. 2007 లో చిన్నయ్య చనిపోగానే ఆ ట్రస్ట్ బాధ్యతలు మొత్తం ఆమె భుజాన వేసుకుంది. సంస్థ పేరును కూడా 'చిన్నయ్య ఆదివాసీ వికాస్ ట్రస్ట్' గా మార్చివేసింది. కార్యకలాపాలను కూడా విస్తృతం చేయడం మొదలుపెట్టింది. తొమ్మిదేళ్ల సమయంలో భూదేవి మూడు మండలాలలో.. 62 గ్రామాల్లో తిరిగి అందరినీ చైతన్య పరిచింది.. సమస్యలను తెలుసుకుంది.

అలా చాలా గ్రామాలు తిరిగిన భూదేవికి ఎన్నో సమస్యలు కనిపించాయి. రోడ్లు సరిగా లేకపోవడం, తాగడానికి నీరు కూడా లేకపోవడం, ఆసుపత్రి సదుపాయం లేకపోవడం.. ఇలాంటివన్నీ ఆమె ప్రభుత్వానికి తెలియజేయాలని భావించింది. ఐ.టి.డి.ఏ. సహాయంతో ఒక్కో విషయాన్ని ఆమె ప్రభుత్వానికి చేరవేయడం మొదలుపెట్టింది. కానీ చాలా వరకూ అధికారులు రావడం, చూడడం వెళ్లిపోవడం ఇలానే జరిగేది. దాదాపు మూడేళ్లు ఇలాంటి సంఘటనలే ఎదురయ్యాయి. కానీ అక్కడి ప్రజలు మాత్రం భూదేవిని నమ్మడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా ఆమె చేస్తున్న మంచి పనులకు అండగా నిలవడం మొదలుపెట్టారు.

హెల్త్ క్యాంపులు మొదలుపెట్టి ప్రజలకు కావాల్సిన మందులను అందిచడం మొదలుపెట్టారు. పిల్లలు లోపాలతో పుట్టడం.. హిమోగ్లోబిన్ లేకపోవడం, రోగనిరోధక శక్తి అన్నది చాలా తక్కువగా ఉండడం లాంటివన్నిటినీ గుర్తించారు. అందుకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. అలా ఆ ప్రాంత ప్రజల్లో ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ ఎన్నో మార్పులకు కారమైంది భూదేవి చేసిన కృషి.

ఆ తర్వాత పంటల విషయంలో కూడా కీలక మార్పులు తీసుకుని రావడానికి భూదేవి ప్రయత్నాలు మొదలుపెట్టింది. సంప్రదాయబద్ధమైన విత్తనాలను సేకరించడం మొదలుపెట్టింది. ఒకరి నుండి సేకరించిన విత్తనాలను మరొకరికి.. ఇలా రైతులకు ఇస్తూ పండించమని సూచనలు ఇవ్వడం మొదలుపెట్టింది ఆమె. ఆ తర్వాతా మెల్లిగా ఆమె ఆశించిన ఫలితాలు రావడం మొదలయ్యాయి. WASSAN, NABARD లాంటి ఆర్గనైజేషన్స్ తో ఆమె చేతులు కలిపింది. 125 రకాల విత్తనాలను ఆమె ఎంతో మంది రైతులకు పంచి ఆ పంటలు అంతరించి పోకుండా చేసింది. రైతులు పండించిన పంటలను మార్కెటింగ్ చేసి వారి ఇళ్లల్లో కూడా ఆనందాన్ని నింపింది. ఆమె అక్కడితోనే ఆగలేదు ఎంతో నేర్చుకోడానికి ప్రయత్నించింది. 2013లో చైనాకు వెళ్లి దినుసులకు సంబంధించిన పలు అంశాలను తెలుసుకుంది. 2016 లో కంప్రెహెన్సివ్ రివైవల్ ఆఫ్ మిల్లెట్స్ ప్రోగ్రామ్ ను మొదలుపెట్టి 47 హాస్టల్స్ లోని విద్యార్థులకు న్యూట్రిషన్ బిస్కెట్స్ ను అందించేది. ఇంకా తాను చేయాల్సింది.. సాధించాల్సింది చాలా ఉందని.. గిరిజన ప్రాంతాలలో ఇంకా ఎన్నో మార్పులు తీసుకుని రావాలని అనుకుంటున్నానని ఆమె చెబుతోంది.

Next Story