నీ ధృడ సంకల్పానికి జోహార్లు ప్రసాద్.. నిన్ను చూసైనా జగన్..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Sept 2019 3:58 PM ISTఏపీ మాజీ మంత్రి, టీడీపీ యువనేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం జగన్‌పై ఫైర్ అయ్యారు. వరుస ట్వీట్లతో జగన్ పాలనను, వైసీపీ తీరును ఎండగట్టే ప్రయత్నం చేశారు. 25 మంది ఎంపీలను ఇవ్వండి.. కేంద్రం మెడలు వంచుతా అన్న జగన్, కేసుల మాఫీ కోసం నడుం వంచి ప్లీజ్ ప్లీజ్ అంటూ కాళ్ళు పట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
కానీ.. నడిచే ఆస్కారం లేని సామాన్య పౌరుడు ప్రసాద్ మాత్రం ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇచ్చాపురం నుండి అనంతపురం వరకు ట్రై సైకిల్ ర్యాలీ మొదలు పెట్టారు. మీ నిబద్ధతకు, ధృడ సంకల్పానికి జోహార్లు ప్రసాద్, మీ సైకిల్ ర్యాలీ త్వరగా పూర్తి అవ్వాలని కోరుకుంటున్నాను. మీ ర్యాలీ చూసి సిగ్గు తెచ్చుకుని, జగన్ ప్రభుత్వం కేంద్రంపై పోరాడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని, వాల్తేరుతో కూడిన రైల్వే జోన్ సాధించాలని ఆశిద్దామని ట్వీట్ చేశారు.
అలాగే మరో ట్వీట్ లో.. మీ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని అన్నందుకే అయ్యన్నపాత్రుడి మీద మీరు కేసు పెడితే.. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిని నడిరోడ్డుమీద కాల్చి చంపాలి అని అన్న మిమ్మల్ని ఏం చెయ్యాలి జగన్? ఉరి తియ్యాలా? అని ప్రశ్నించారు.
మీకు, మీ నాయకులకు దమ్ముంటే టీడీపీ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అంతే కానీ చేతగాని దద్దమ్మల్లా కేసులు పెట్టి పారిపోకండి. ప్రజా సమస్యలు పరిష్కరించే సత్తా లేక మా నాయకుల ప్రెస్ మీట్లపై కులమతాల పేరుతో కేసులు పెడతారా? ఇది కాదా తుగ్లక్ చర్య అంటే!! అంటూ ఫైర్ అయ్యారు. లోకేష్ ట్వీట్‌పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.