అవ్వా, తాతల్ని కూడా వదల్లేదు : లోకేష్
By రాణి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తూ టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. రాష్ర్టంలో వృద్ధులకు పింఛన్లు నిలిపివేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రతికుండగానే మమ్మల్ని చంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెన్షన్ దారులు. పెన్షన్ కోసం సంబంధిత కార్యాలయానికి వెళ్తే..మీరు చచ్చిపోయారు. మీకు పెన్షన్ ఇవ్వడం కుదరదని అధికారులు ఖరాకండిగా చెప్తుండటం వృద్ధుల చేత కన్నీరు పెట్టిస్తోంది. మేం చచ్చిపోయామని మాకే చెప్తుంటే..చాలా బాధగా ఉందని వాపోతున్నారు.
‘‘ఒక్క అవకాశం ఇస్తే...ఎన్ని కష్టాలో... నష్టాలో...అనర్ధాలో...ఆఖరికి అవ్వా, తాతలను కూడా వదలలేదు. @ysjagan గారు. పండుటాకులకు పెన్షన్ తీసేసిన పాపం ఊరికే పోదు.’’
అలాగే చిత్తూరు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ కార్యకర్తపై రౌడీ షీట్ కేసు నమోదు చేయడంపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వార్త ఒక దినపత్రికలో ప్రచురితమవ్వగా ఆ పేపర్ క్లిప్ ను జత చేస్తూ లోకేష్ ట్వీట్ చేశారు.
‘‘సోషల్ మీడియాలో ప్రభుత్వ విధానాలను తప్పుబట్టినందుకే రౌడీ షీట్ ఓపెన్ చేసే దుస్థితికి జగన్ గారు దిగజారిపోయారు. మరి శాసనసభ సాక్షిగా రౌడిల్లా వ్యవహరిస్తున్న వైకాపా నాయకులు, మంత్రులను ఏం చెయ్యాలి, ఏం కేసులు పెట్టాలి. ?’’ అని లోకేష్ ప్రశ్నించారు.