విజయమ్మ రాసిన ‘నాలో.. నాతో.. వైఎస్సార్’ పుస్తకంలో ఏముంది?
By సుభాష్ Published on 8 July 2020 5:52 AM GMTదివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణిగా సుపరిచురాలైన విజయమ్మ మరోసారి వార్తల్లో వచ్చారు. 37 ఏళ్ల పాటు కలిసి బతికి వైఎస్ తో తనకున్న అనుబంధం.. అనుభవాలతో పాటు.. ఆయన గురుతుల్ని ఏర్చికూర్చి తాజాగా ఒక పుస్తకంగా అచ్చేశారు. వైఎస్ తో తనకున్న భావోద్వేగ అనుబంధం గురించి ఆమె తన తాజా పుస్తకంలో వెల్లడించనున్నారు. ‘నాలో.. నాతో.. వైఎస్సార్’ పేరుతో పబ్లిష్ కానున్న ఈ పుస్తకం వైఎస్ 71వ జయంతి సందర్భంగా ఈ రోజు (బుధవారం) ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు.
దాదాపు పదకొండేళ్ల క్రితం (2009 సెప్టెంబరు 2న) హెలికాఫ్టర్ ప్రమాదంలో అనూహ్యంగా మరణించిన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారంగా ఈ పుస్తకాన్ని చెబుతున్నారు. వైఎస్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తాను తెలుసుకున్నానని.. ప్రజలకు తెలీని ఆయనకు సంబంధించిన కొత్త విషయాల్ని తెలియజేసేందుకే తానీ పుస్తకాన్ని రాసినట్లుగా విజయమ్మ చెబుతున్నారు.
ఒక తండ్రిగా.. భర్తగా.. ఎలా ఉంటారో ఈ పుస్తకంలో చెప్పనున్నారు. కొడుకుగా.. తండ్రిగా.. అన్నగా.. తమ్ముడిగా.. భర్తగా.. అల్లుడిగా..మామగా.. స్నేహితుడిగా.. నాయకుడిగా నిజ జీవితంలోవైఎస్సార్ వివిధ దశల్లో ఎలా ఉండేవారో ఈ పుస్తకంలో విజయమ్మ వివరించారు.
ఇంట గెలిచి.. రచ్చ గెలిచిన తీరును.. ఇంట్లో వారి అవసరాల్ని అర్థం చేసుకున్నట్లే.. ప్రజలనూ కుటుంబ సభ్యులుగా భావించి వారి అవసరాల్ని అర్థం చేసుకున్న విధానాన్ని ఇందులో పేర్కొన్నారు. వైఎస్సార్ జీవితంలోని ప్రతి దశను ప్రస్తావించటంతో పాటు.. ఎప్పుడు ఎలా ఉండేవారో.. ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండేవారో.. ఈ పుస్తకం ద్వారా విజయమ్మ వైఎస్ ను ప్రజలకు మరింత దగ్గరకు చేయనున్నారని చెప్పాలి.