కూతురికి పెళ్లి చేస్తే కట్నం ఇవ్వాలని..

By రాణి  Published on  7 Feb 2020 10:47 AM GMT
కూతురికి పెళ్లి చేస్తే కట్నం ఇవ్వాలని..

9 నెలలు కడుపులో మోసి జన్మనిచ్చిన తల్లే కూతురిని భారంగా భావించింది. తండ్రి కూడా తల్లికి వత్తాసు పలికాడు. తోడబుట్టిన అన్న కూడా ఆమె పట్ల జాలి చూపలేదు. పెళ్లి చేస్తే కట్నం ఇవ్వడంతో పాటు..పెళ్లి ఖర్చులు కూడా పెట్టుకోవాల్సి వస్తుందని పెళ్లి ఊసే ఎత్తట్లేదు. 32 ఏళ్లు వచ్చినా..ఇంకా పెళ్లి చేయకపోవడంతో ఆ యువతే తనకు పెళ్లి చేయమని అడిగిన పాపానికి ఆమెను రాళ్లతో కొట్టి చంపేందుకు ప్రయత్నించారు. ఈ ఘోరమైన దుర్ఘటన నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం వెలగలగూడెంలో చోటు చేసుకుంది. వెలగలగూడెంకు చెందిన కవిత (32) పీజీ పూర్తి చేసింది. పెళ్లి వయసు దాటిపోయినా ఇంకా పెళ్లి చేయకపోవడంపై ఆమె అసహనం చెందింది. తనతోటి స్నేహితులందరికీ పెళ్లిళ్లై, పిల్లలతో సంతోషంగా ఉంటుంటే..తనకు మాత్రం పెళ్లి చేయకుండా జీవితాన్ని నాశనం చేస్తున్నారని తనలో తానే బాధపడేది కవిత.

పెళ్లి గురించే తరచూ కుటుంబ సభ్యులతో గొడవపడేదని గ్రామస్తులు చెప్పారు. వారికున్న ఏడెకరాల్లో 2 ఎకరాలు తనకు కట్నంగా ఇచ్చి పెళ్లి చేయాలని డిమాండ్ చేసేది కవిత. కట్నం అయితే ఇస్తాంగానీ..ఎట్టిపరిస్థితుల్లోనూ పొలం రాసిచ్చే ప్రసక్తే లేదని తెల్చేశారు తల్లిదండ్రులు. ఈ క్రమంలోనే కూతురికి పెళ్లి చేస్తే డబ్బుతో పాటు ఆస్తి కూడా ఇవ్వాల్సొస్తుందని భావించిన తల్లిదండ్రులు ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం గురువారం రాత్రి ఇంటిలో నిద్రిస్తున్న కవిత తలపై బలంగా బండరాయితో కొట్టారు. దీంతో కవిత కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి పరుగు పరుగున వచ్చారు. వారు వచ్చేసరికే తల్లిదండ్రులు, అన్న అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. స్థానికులే కవితను సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మనుషుల్లో మానవత్వం మంట గలిసిపోతుందనడానికి ఇలాంటి ఘటనలెన్నో ఉన్నాయి. కూతురికి పెళ్లి చేసి పంపడం తల్లిదండ్రుల కనీస బాధ్యత. కొందరు కూతురిని భారంగా భావించి భూమ్మీదికి రాకుండానే చంపేస్తుంటే..మరికొందరు ఇదిగో..ఇలా వయసొచ్చిన కూతురిని గుట్టుచప్పుడు కాకుండా చంపేసి..ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారు.

Next Story
Share it