న‌ట‌న‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నం అక్కినేని నాగేశ్వ‌ర‌రావు. ఆయ‌న పేరు మీద ఎ.ఎన్.ఆర్ జాతీయ పుర‌స్కారం ప్ర‌తి సంవ‌త్స‌రం ఇస్తున్న విష‌యం తెలిసిందే. 2018, 2019 సంవ‌త్స‌రాల‌కు గాను ఎ.ఎన్.ఆర్ జాతీయ పుర‌స్కారంను ఈ రోజు నాగార్జున‌, టి.సుబ్బిరామిరెడ్డి ప్ర‌క‌టించారు. 2018గానూ శ్రీ‌దేవికి, 2019కి గానూ బాలీవుడ్ హీరోయిన్ రేఖకు ఈ అవార్డు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

అనంతరం అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన మీడియా మీట్‌లో నాగార్జున మాట్లాడారు. ఈనెల 17న హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్డూడియోస్‌లో ఈ పుర‌స్కార ప్ర‌దాన కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తామన్నారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ అవార్డులు అంద‌జేయనున్నట్లు తెలిపారు. శ్రీ‌దేవి త‌ర‌పున‌ బోనీక‌పూర్‌, జాన్వీక‌పూర్ ఈ అవార్డు స్వీక‌రిస్తారన్నారు. అంతే కాకుండా ఈ అవార్డు కింద రూ.5 ల‌క్ష‌ల న‌గ‌దుతో పాటు, జ్ఞాపిక కూడా అంద‌జేస్తున్నట్లు తెలిపారు. అయితే శ్రీ‌దేవికి త‌న పేరుమీదున్న అవార్డు ఇవ్వాల‌న్న‌ది నాన్న కోరిక అని ఆయన అన్నారు. కానీ..కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల కుర‌ద‌లేదన్నారు. ఇన్నాళ్ల‌కు ఆమెకు అవార్డు ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

అలాగే రేఖ గారితో కూడా నాన్న‌కి మంచి అనుబంధం ఉందని తెలిపారు. ఈ అవార్డు సంగ‌తి చెప్ప‌గానే రేఖ గారు త‌ప్ప‌కుండా వ‌స్తానని మాట ఇచ్చారని నాగార్జున తెలిపారు. అయితే ఇదే కార్య‌క్ర‌మంలో అన్న‌పూర్ణ ఫిల్మ్ స్కూల్‌లో డిగ్రీ పూర్తి చేసిన 70 మంది విద్యార్థుల‌కు ప‌ట్టాలు అందివ్వ‌బోతున్నట్లు ఆయన చెప్పారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.